బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల తొలగింపు
విదేశీ వస్తువుల వినియోగం పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం :
సుందరయ్య వర్ధంతి సెమినార్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య
నవతెలంగాణ-కాప్రా
“సర్” పేరుతో ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తొలగిస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) కాప్రా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో “వర్తమాన రాజకీయాలు – మన కర్తవ్యం” అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఆయన ప్రసంగించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యలు జి. శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి వీరయ్య, కోమటి రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ప్రజలకు పొదుపు చర్యలపై సలహాలు ఇవ్వడం విడ్డూరమన్నారు. యుద్ధ పరిస్థితులను చూపిస్తూ పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం సరైన విధానం కాదన్నారు. విదేశీ వస్తువుల వినియోగం పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. సోషల్ మీడియా, గూగుల్ ఆధారంగా ఓటర్ల వివరాలను పరిశీలించి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారని తెలిపారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని, ఓటు తొలగించినా ప్రజలే దానిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
ఇజ్రాయిల్, అమెరికా–ఇరాన్ యుద్ధంపై చిన్న చిన్న దేశాలు కూడా దాడులను ఖండిస్తుంటే భారత్ ప్రభుత్వం మౌనం పాటించడం దురదృష్టకరమన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని చైనా సూచించిందని, భారత్ కూడా అదే దిశగా కృషి చేయాల్సిందని అన్నారు.పబ్లిక్ సెక్టార్ సంస్థలను బలోపేతం చేయాలని, విద్యుత్ రంగం సహా ప్రభుత్వ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సుందరయ్య ఆనాడే సూచించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగాలపై పట్టుదల తగ్గిందని, వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తర భారతదేశంలో యూనియన్లు లేకపోయినా వేలాది కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారని, కానీ వారిపై పోలీసులు లాఠీచార్జీలు చేసి జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కోడ్స్ అమలుతో కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు ప్రజల మధ్య నిరంతరం ఉండి కార్మిక వర్గ సమస్యలపై పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యలు కోమటి రవి ప్రసంగించారు. అనంతరం బీవీ సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కంపెనీ కార్మికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సర్ పేరుతో ఓటర్ల జాబితాల్లో అవకతవకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



