పండుగ పూట పస్తులేనా..?

– నాలుగు నెలలుగా అందని వేతనాలు
– ఆందోళనలో జిపి కార్మికులు
నవతెలంగాణ-భూపాలపల్లి:మల్హర్ రావు.
సద్దుల బతుకమ్మ,దసరా పండుగలకు పస్తులుండాలసిందేనా.? అని గ్రామపంచాయతీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తమపట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని, నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాలుగు నెలలుగా వేతనాలు అందక కార్మికులు కష్టాలను ఎదుర్కొంటున్నారు.నిత్యం పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సమస్యల పరిస్కారంపై దృష్టి సారించడం లేదు.జనాభా అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేరు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోంది.ప్రభుత్వం అరకొర వేతనాలు చెల్లించి వెట్టి చాకిరి చేయించుకుంటుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు.తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు.
చాలి, చాలని వేతనాలు…
భూపాలపల్లి జిల్లాలో 241 గ్రామపంచాయతీల్లో సుమారుగా 1350 మంది కార్మికులు,మల్హర్ మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో 72 మంది కార్మికులు ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 జనాభా కు ఒక కార్మికుడు ఉండాలని 2018లో రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ 51ని తీసుకొచ్చింది.జనాభాకు అనుగుణంగా కార్మికులను నియమించి రూ.8,500 చెల్లించాలని ఆజివోలో పేర్కొన్నారు.కానీ చాలా గ్రామపంచాయతీల్లో కార్మికులకు ఆ జీవోలో పేర్కొన్న వేతనాలు అందడంలేదు.మరికొన్ని గ్రామపంచాయితీల్లో గతంలో గ్రామ అవసరాలను బట్టి కార్మికులను ఉద్యోగంలోకి తీసుకున్నారు.అలాంటి గ్రామపంచాయితీల్లో ఎంతమంది కార్మికులు ఉన్నా రూ.8,500లోనే సర్దుబాటు చేయాల్సి వస్తోంది.వాస్తవానికి ప్రతి పదేండ్లకోసారి జనగణన నిర్వహించాలి.2021లో నిర్వహించాల్సిన జనగణన నిర్వహించక పోవడం గ్రామపంచాయితీ కార్మికుల పాలిట శాపంగా మారింది.పంచాయతీ కార్మికుడు మరణిస్తే రూ.2 లక్షల బీమా చెల్లిoచేందుకు సీఎం కేసీఆర్ నాలుగేళ్ళ క్రితం హామీ ఇచ్చారు.కానీ నేటికీ అది అమలు కావడం లేదు.ప్రభుత్వం ప్రతి కార్మికుడికి బీమా సౌకర్యం కల్పించి,ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
నెలల తరబడి బకాయి…
కార్మికులకు నెలకు ఇచ్చే వేతనం రూ.8,500 ఇంత తక్కువ మొత్తంలోనే ఇస్తున్న పల్లెల వికాసంలో వారు ఎంతో శ్రమిస్తున్నారు.అయినప్పటికీ నెలల తరబడి పెండింగ్ లో వేతనాలు ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.కలెక్టరేట్ తోపాటు గ్రామ పంచాయితీల తెలంగాణ గ్రామపంచాయితి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆందోళన సైతం చేపట్టారు.ప్రభుత్వం, అధికారులు స్పందించి జీతాలు అందించి తమ ఆర్థిక కష్టాలను తీర్చాలని కార్మికులు కోరుతున్నారు.
డిమాండ్లు ఇవే…
జివో 51 ప్రకారం మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల మాదిరిగానే తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.కార్మికులను పర్మినెంట్ చేయాలని,ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, పిఆర్సీలో నిర్ణయించిన కనీస వేతనం రూ.19వెలు చెల్లించాలి.జివో నెంబర్ 60 ప్రకారం స్విపర్లకు రూ.15 వెలు, పంప్ ఆపరేటర్లు,ఎలక్రిషన్స్, డ్రైవర్లు, కరొబార్లు, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, జిపి కార్మికులకు అన్ని చట్టాలు అమలు చేయాలని, కారొబార్, బిల్ కలెక్టర్ వంటి ఉద్యోగాల్లో పంచాయతీ కార్మికులకు అవకాశం కల్పించాలని, ఈఎస్ఐ, పిఏప్ అమలు చేయాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. జిపి కార్మికుల జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు.వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.దసరా పండుగకు ముందుగానే కార్మికుల వేతనాలు చెల్లించాలి.

Spread the love