గాజాస్ట్రిప్‌నకు సాయాన్ని అడ్డుకుంటాం : ఇజ్రాయిల్‌

 Israelటెల్‌ అవీవ్‌ : గాజాస్ట్రిప్‌లోకి అన్ని రకాల సాయాన్ని, వస్తువుల ప్రవేశాన్ని అడ్డుకుంటామని ఇజ్రాయిల్‌ ప్రకటించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు కోసం ఇజ్రాయిల్‌ చేస్తున్న ప్రతిపాదనను హమాస్‌ అంగీకరించకపోతే ‘తీవ్రమైన పరిణామాలు’ ఉంటాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. సాయం పూర్తిగా నిలిచిపోయిందా లేదా అనేది తెలియాల్సి వుంది. రంజాన్‌ మరియు పాస్‌ ఓవర్‌ లేదా ఏప్రిల్‌ 20 వరకు కాల్పుల విరమణ మొదటి దశను పొడిగించే ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నట్టు ఇజ్రాయిల్‌ ఆదివారం తొలుత ప్రకటించింది. అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్టు ఇజ్రాయిల్‌ తెలిపింది. ఇజ్రాయిల్‌-హమాస్‌ కాల్పుల విరమణ మొదటి దశలో.. మానవతా సాయం కొనసాగింది. అయితే ఈ ఒప్పందం శనివారంతో ముగిసింది. కాల్పుల విరమణ రెండవ దశపై చర్చలు జరగాల్సి వుంది. రెండోదశలో ఇజ్రాయిల్‌ సైన్యం ఉపసంహరణ, శాశ్వత కాల్పుల విరమణకు బదులుగా హమాస్‌ మిగిలిన బందీలను విడిచిపెట్టాల్సి వుంది. ఈ ఒప్పందం ప్రకారం.. హమాస్‌ మొదటి రోజు సగం బందీలను విడుదల చేయాల్సి వుందనీ, శాశ్వతకాల్పుల విరమణపై ఒప్పందం కుదిరిన తర్వాత మిగిలిన వారిని విడుదల చేయాల్సి వుందని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ కార్యాలయం తెలిపింది.ఇజ్రాయిల్‌-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ కోసం ఏడాది నుంచి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్టు, ఖతార్‌, అమెరికాలు ఈ ఒప్పందంపై వ్యాఖ్యానించాల్సి ఉంది. హమాస్‌ కూడా ఈ ప్రతిపాదనపై ఇప్పటికీ స్పందించలేదు.

Spread the love