ఇజ్రాయిల్‌ – పాలస్తీనా శాంతి ఒప్పందం

 Sampadakiyam గాజాలో నాలుగు రోజుల పాటు దాడులను నిలిపి వేసేందుకు, ఇజ్రాయిల్‌ జైళ్లలో ఉన్న 150 మంది మహి ళలు, పిల్లలను, హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిలో 50 మహిళలు, పిల్లలను విడుదల చేసేందుకు ఒక ఒప్పందం కుదిరింది. ఈ పరిణామానికి అంతర్జాతీయ సమాజం స్వాగతం పలికింది, అది అక్కడికే పరిమితం కాకుండా నిర్బంధించిన వారందరి విడుదల జరగాలని, గాజాపై దాడులను శాశ్వతంగా నిలిపివేయాలని కోరుతున్నారు. కతార్‌ కేంద్రంగా ఈజిప్టు, అమెరికా ప్రమేయంతో ప్రారం భమైన సంప్రదింపుల్లో గత వారం రోజులుగా ఒప్పందం గురించి వార్తలు వస్తున్నప్పటికీ బుధవారమే స్పష్టత వచ్చింది. అయితే శుక్ర వారంలోగా అమలు ప్రారంభమయ్యే అవ కాశం లేదని ఇజ్రాయిల్‌, అమెరికా అధికారులు ప్రకటించారు. గురువారం నాడు గాజాలో కొన్ని చోట్ల దాడులు జరిగినట్లు, ఒక ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిని ఇజ్రాయిల్‌ మిలిటరీ అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చిన పూర్వరంగం కొన్ని సందేహాలను ముం దుకు తెచ్చింది. ఇదిలా ఉండగా రెండవ దశలో మరో 50 మంది బందీల విడుదలకు చర్చలు జరుపుతున్నట్లు ప్రధాన మధ్యవర్తిగా ఉన్న కతార్‌ విదేశాంగ మంత్రి ప్రకటించాడు.
అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయిల్‌ మిలిటరీ గాజాను సర్వనాశనం గావిస్తూ 14,500 మంది ప్రాణాలను బలి గొన్నది, 6,800 మంది అంతర్దానంతో సహా 33వేల మంది గాయపడినట్లు సమాచారం. ఇప్పటివరకు నివా సాలు, ఆసుపత్రులు, స్కూళ్లు, మసీదులు, చర్చీల మీద 40వేల టన్నులకు పైగా పేలుడు పదార్ధాలతో విధ్వంస కాండ సాగించింది. ఇరవై మూడు లక్షల మంది జనాభాలో పదహారు లక్షల మంది నెలవులు తప్పారు. ఎటు చూసినా ఆకలి, ఆర్తనాదాలు. ఇంకా ఎంతమంది బలికావాలి, బందీ లను విడుదల చేస్తే దాడులు నిలిచే అవకాశం ఉందని పాలస్తీనా సమాజం నుంచి హమాస్‌, ఇతర సంస్థల మీద కూడా ఒత్తిడి ఉండటం సహజం. మరోవైపున సామాన్య జనాన్ని హతమార్చటం, హమాస్‌ సాయుధులను ఎంత మందిని పట్టుకున్నదీ స్పష్టత లేకపోవటం, 237 మంది బందీల జాడను కనుగొనటంలో ఇజ్రాయిల్‌ విఫలం, వారిలో 50మంది ఇజ్రాయిల్‌ దాడుల్లో మరణించినట్లు హమస్‌ ప్రకటించటంతో ఇంటా బయటా తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది. బందీలలో ఇజ్రాయిల్‌ పౌరులతో పాటు 35 మంది అమెరికన్లతో సహా 40దేశాలకు చెందిన వారు ఉన్నారు. రెండవది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆయు ధాలతో ఎంతగా సాయపడినప్పటికీ గాజాపై దాడులు ఇజ్రాయెల్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. అనేక ప్రయివేటు సంస్థలు ఇబ్బం దుల్లో పడి మూసివేత దిశగా ఉన్నాయి. దీంతో అంతర్జా తీయ ప్రయివేటు సంస్థల నుంచి ఇప్పటికే ఆరు వందల కోట్ల డాలర్లు అప్పు తీసు కొనేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాదికి దేశ రుణభారం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. మూడున్నరలక్షల మంది రిజర్వు మిలిటరీని కూడా రప్పిం చటంతో ఆ ఖర్చు కూడా పెరుగుతుంది. గాజాపై దాడుల్లో ఏం జరుగుతుందో తెలియకుండా సెన్సార్‌ విధించింది. ఇస్లామిక్‌ జీహాద్‌ అనే సంస్థ గాజాలో జరుపుతున్న దాడు ల్లో ఇజ్రాయిలీ మిలిటరీ వందల కోట్ల డాలర్లమేర నష్టపో తున్నట్లు వార్తలు. ఇజ్రాయిల్‌కు నిస్సిగ్గుగా మద్దతునిస్తున్న అపరమానవతావాద పశ్చిమ దేశాలు అక్కడ జరుగుతున్న మారణకాండను సమర్ధించుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. మరోవైపున ఇల్లు తగులబడుతుంటే బొగ్గులేరుకునేందుకు చూసినట్లుగా గాజాపై దాడులను ప్రాంతీయ యుద్ధంగా మార్చి లబ్ది పొందాలని ఎంతగా రెచ్చగొట్టినా, అరబ్బు, ఇస్లామిక్‌ దేశాలు సంయమనం పాటించటంతో అమెరికా, ఐరోపా ధనిక దేశాల మీద కూడా ఒత్తిడి పెరుగుతున్నది.
ఒప్పందం జరిగిన తీరు చూస్తే హమాస్‌ చెప్పిన అంశా లకు తప్పనిసరై ఇజ్రాయిల్‌ అంగీకరించాల్సి వచ్చినట్లుగా కనిపిస్తున్నది. నెతన్యాహు సంకీర్ణ కాబినెట్‌లో ఉగ్రవాదు లుగా పేరుమోసిన హోంతో సహా ముగ్గురు మంత్రులు వ్యతిరేకించటమే దీనికి నిదర్శనం. తరువాత చింతించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. అమె రికా, ఈజిప్టు నెతన్యాహు మీద ఒత్తిడి తెచ్చి నట్లుగా కనిపిస్తోంది. గాజా మీద మిలిటరీ విమానాలు ఎగరకూడదని, జనం కదలికల మీద ఎలాంటి నియంత్రణలు ఉండకూడ దన్న షరతులకు అంగీకరించాల్సి వచ్చింది. రోజుకు పది మంది చొప్పున 50 మంది బందీలను విడుదల చేస్తే దానికి అనుగుణం గా 30మంది చొప్పున 150మంది పాలస్తీనా పౌరులను జైళ్ల నుంచి వదలి పెట్టాలన్నది అంగీకారం. బందీలందరినీ విడుదల చేయా లంటే దానికి అనుగుణంగా పాలస్తీనియ న్లనూ వదలిపెట్టాలి. ఈ కారణంగానే దాడుల విరమణ ఎక్కువ రోజులు కొనసాగ వచ్చనే అభిప్రాయం వెలువడింది. రెండు వైపులా చిత్తశుద్ధి, అనుమానాలకు తావివ్వ కుండా ఉంటేనే అది జరుగుతుంది. ఎటు వైపు నుంచి ఉల్లంఘనలు జరిగినా పరిస్థి తులు ఏవిధంగా ఉండేది చెప్పలేము.

Spread the love