పాలస్తీనా శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయిల్‌ దాడి

– తొమ్మిది మంది పాలస్తీనియన్లు మృతి
– కొనసాగుతున్న హింస, పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు
– ఐరాస సహా పలు దేశాల ఖండన
– మరో 25 ఎఫ్‌-35 విమానాలు కొనుగోలు చేసిన ఇజ్రాయిల్‌
జెరూసలేం : ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో జెనిన్‌ శరణార్ధ శిబిరంపై సోమవారం తెల్లవారు జామున ఇజ్రాయిల్‌ దాడి చేసింది. మిలటరీ డ్రోన్‌లు, బలగాలతో జరిపిన ఈ దాడిలో తొమ్మిదిమంది పాలస్తీనియన్లు మరణించారని. పలువురు గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతమంతా వేలాది బలగాలను ఇజ్రాయిల్‌ మోహరించింది. సోమవారం సాయంత్రానికి కూడా జెనిన్‌ శరణార్ధుల శిబిరంలో సాయుధ ఘర్షణలు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా తెలిపింది. మొత్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయిల్‌ బలగాలు శిబిరంపై దాడిని కొనసాగిస్తున్నాయి. అవసరమైతే మరిన్ని బలగాలను, వాహనాలను ఇజ్రాయిల్‌ ఆర్మీ శిబిరంలోకి పంపిస్తోందని మీడియా వార్తలు తెలిపాయి. రద్దీగా వున్న శిబిరం వీధుల్లో నుండి నల్లటి దట్టమైన పొగ పైకి లేవడం కనిపిస్తోంది. తుపాకుల శబ్దాలు వినిపిస్తున్నాయి. పై నుండి డ్రోన్‌ల శబ్దాలు కూడా వినపడుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్‌ను నిలుపుచేశారని అక్కడి ప్రజలు తెలిపారు. శిబిరంలో పిల్లలు భయంతో వణికిపోతూ ఏడుస్తున్నారని తెలిపారు. ఇజ్రాయిలీ బలగాలకు దారిని క్లియర్‌ చేయడం కోసం ఇరుకుగా వుండే ఆ వీధుల్లో మిలటరీ బుల్డోజర్లు భవనాలను ధ్వంసం చేస్తున్నాయి.
పలు దేశాల ఖండన
కాగా ఈ హింసాకాండను పాలస్తీనియన్లు తీవ్రంగా ఖండించారు. గాజా నగర సెంటర్‌లో పాలస్తీనా వర్గాలు ప్రదర్శన నిర్వహించాయి. జెనిన్‌ ప్రజలకు సంఘీభావం తెలిపాయి. తక్షణమే ఇజ్రాయిల్‌ దూకుడుచర్యను నిలువరించాలని నినాదాలు చేశారు. ‘ప్రతిఘటనకు సాయమందిస్తాం, జెనిన్‌వాసులకు బాసటగా వుంటామని రాసిన బ్యానర్లను ప్రదర్శించారు. ఈ మిలటరీ ఆపరేషన్‌ను అంతమొందించడానికి తక్షణమే అంతర్జాతీయ పక్షాలు, అరబ్‌ పక్షాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం వుందని వారు నొక్కి చెప్పారు. ఇజ్రాయిల్‌ చర్యను ఇరాన్‌, ఈజిప్ట్‌, జోర్డాన్‌ సహా పలు దేశాలు, అరబ్‌ లీగ్‌, ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసి)లు తీవ్రంగా ఖండించాయి. హేయమైన నేరానికి ఇజ్రాయిల్‌ పాల్పడిందని ఓఐసి విమర్శించింది. ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాయపడిన వారికి తక్షణమే సాయం అందేలా అవకాశం కల్పించాల్సిందిగా మానవతా కోఆర్డినేటర్‌ లిన్‌ హేస్టింగ్స్‌ ట్వీట్‌ చేశారు. అంతర్జాతీయ సమాజం చేతులు ముడుచుకుని కూర్చుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అనుకున్న ప్రకారమే సాగుతోంది
అనుకున్న ప్రకారమే ఆపరేషన్‌ కొనసాగుతోందని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గల్లాంట్‌ వ్యాఖ్యానించారు. అత్యున్నత మిలటరీ కమాండర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ ఎప్పుడు ముగుస్తుందన్నది ఎలాంటి సూచనలు చేయలేదు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో శరణార్దుల శిబిరంపై దాడి చేయడంతో సైనిక ఆపరేషన్‌ ప్రారంభమైందని సైనిక ప్రతినిధి తెలిపారు. ఆయుధాలను ధ్వంసం చేయడం, వాటిని జప్తు చేసుకోవడం ఈ ఆపరేషన్‌ లక్ష్యమని చెప్పారు. నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయాన్నలది తమ ఆలోచన అని చెప్పారు. మొత్తంగా 2వేలమంది సైనికులు ఈ అపరేషన్‌లో పాల్గొన్నారు.
300కోట్ల డాలర్లతో 25కి పైగా స్టెల్త్‌ జెట్‌లు
300కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా 25కి పైగా ఎఫ్‌-35 స్టెల్త్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఆమోద ముద్ర లభించినటు ఇజ్రాయల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాకు వెలుపల ఈ యుద్ధ విమానాలను సమకూర్చుకున్న మొదటి దేశం ఇజ్రాయిల్‌నే. తాజా ఒప్పందంతో ఇజ్రాయిల్‌ వైమానిక దళంలో ఎఫ్‌-35 విమానాల సంఖ్య 75కి చేరనుంది. అమెరికా నుండి ఇజ్రాయిల్‌ అందుకున్న రక్షణ సహాయ ప్యాకేజీ ద్వారా ఈ ఒప్పందానికి నిధులు అందాయని ఇజ్రాయిల్‌ రక్షణ అధికారులు తెలిపారు.

Spread the love