అచ్ఛేదిన్‌ కాదు.. అంథకారం

–  దోపిడీకి సహకరిస్తున్న మోడీ పాలన
– హౌరా బహిరంగసభలో కేరళ సీఎం పినరయి విజయన్‌
– పెద్ద ఎత్తున తరలి వచ్చిన వ్యవసాయ కార్మికులు హౌరా నుంచి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
దేశంలో మోడీ పాలనలో అచ్చేదిన్‌ అని చెబుతున్నారనీ, కానీ అంధకారం నడుస్తున్నదని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభల సందర్భంగా హౌరాలోని బిజయోనంద పార్కు(సమర్‌ ముఖర్జీవేదిక)లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు హౌరా మైదాన్‌లోని శరత్‌సదన్‌ నుంచి బిజయోనంద పార్కు వరకు భారీ ప్రదర్శన జరిగింది. దీనికి బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వ్యవసాయ కార్మికులు తరలి వచ్చారు. రెండు కిలోమీటర్ల దూరం సాగిన ప్రదర్శనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆహ్వాన సంఘం నాయకులు, బెంగాల్‌ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి అమియపాత్రో అధ్యక్షతన జరిగిన సభలో విజయన్‌ మాట్లాడారు.
అపురూప వ్యక్తులకు జన్మనిచ్చిన బెంగాల్‌
మోడీ అంధకార పాలన ఫలితంగా పేదల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నదని చెప్పారు. స్వామి వివేకానంద, రవీంధ్రనాథ్‌ఠాగూర్‌, ఎంఎన్‌రారు, ప్రమోద్‌దాస్‌ గుప్తా, జ్యోతిబసు వంటి అపురూప వ్యక్తులకు జన్మనిచ్చిన బెంగాల్‌ దేశానికి గర్వకారణమని తెలిపారు. బెంగాల్‌ ప్రజాపోరాటాలకు ఎంతో గుర్తింపు ఉన్నదనీ, అనేక పోరాటాల్లో వ్యవసాయ కార్మికులు, పేదలు, వృత్తిదారులు ఎంతో మంది పాల్గొన్నారని వివరించారు. రైతాంగ ఉద్యమం ఉధృతంగా సాగిందనీ, ఎంతోమందిని జైలుపాలు చేశారనీ, అయినా వెనుదిరగని పోరాటం సాగిందని వివరించారు. 20 శతాబ్దంలో అక్టోబరు విప్లవం తర్వాత సోషలిస్టు ఆలోచనలు ప్రవేశించడంతో బెంగాల్లో వ్యవస్థీకృత రైతు ఉద్యమం ప్రారంభమైందనివిజయన్‌ అన్నారు.జాతీయస్థాయిలో కిసాన్‌సభ ఏర్పడక ముందే బెంగాల్‌లో జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆర్గనైజింగ్‌ కమిటీలు ఏర్పడి పెద్దఎత్తున ఉద్యమాలు చేశాయని గుర్తుచేశారు. 1943 నాటి వినాశకర బెంగాల్‌ కరువు సమయంలో రైతు సంఘాల ఆధ్వర్యాన వేర్వేరు ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బెంగాల్లో తెబాగ ఉద్యమం దేశ రైతాంగ పోరాటానికి మచ్చుతునకనీ, రైతు ఉద్యమ పునాదిని బలోపేతం చేయడంతోపాటు దోపిడీని అరికట్టిందని అన్నారు.
కేంద్రం, రాష్ట్రాల మత రాజకీయాలు
నేడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నవారు పూర్తిగా మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని విజయన్‌ అన్నారు. విచ్చలవిడి అవినీతి జరగుతున్నదని చెప్పారు. ప్రజలకు చెందాల్సిన డబ్బంతా టీఎంసీ అనుకూలుర చేతుల్లోకి వెళ్తున్నదనీ, మహిళలపై భయంకర హింసాకాండ జరుగుతున్నదని విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వందలాదిమంది కార్యకర్తలు హత్యకు గురయ్యారనీ, ఎక్కువ మందిని వారి గ్రామాల నుంచి వెళ్లగొట్టారని తెలిపారు. అక్రమ రైతు చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను ఏడాదికాలం జరిగిన రైతు పోరాటం వెనక్కు కొట్టిందని ఆయన అన్నారు.
వ్యవసాయంపై కేంద్రానిది చిన్నచూపు
వ్యవసాయం పట్ల కేంద్రానికి చిన్నచూపు ఉన్నదనీ, బడ్జెట్లోనూ అది కనిపించిందని చెప్పారు. 1991లో నయా ఉదారవాద విధానాలు అమల్లోకి తెచ్చిన తర్వాత వ్యవసాయం పూర్తి సంక్షోభంలోకి వెళ్లిందని విజయన్‌ తెలిపారు. సరళీకరణ ఆర్థిక విధానాల గురించి వామపక్షాలు తొలి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాయన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గంలో పయనిస్తోందని చెప్పారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ముందుందనీ, మత ఘర్షణలు లేని రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. పాఠశాల విద్య, శాంతి భద్రతలు, అతితక్కువ శిశు మరణాలు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ఉపాధి కల్పనలోనూ ముందుందన్నారు. వేతనాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రమని వివరించారు.
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదనీ, ఫెడరలిజం అర్థాన్నే మార్చేస్తున్నదని తెలిపారు. రైతు, కార్మిక వ్యతిరేక బిల్లులు తీసుకొస్తున్నదనీ, కనీసం రైతుల అభిప్రాయాలూ తీసుకోవడం లేదని అన్నారు. ఒకే దేశం, భాష, ఒకే ఎన్నికలు అనే నినాదంతో సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నదని వివరించారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో గవర్నర్‌ను ఉపయోగించి అక్కడ విద్యావ్యవస్థలో బీజేపీ అనుకూల విద్యావిధానాన్ని జొప్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మత దేశంగా మార్చే ప్రయత్నాలు
స్వాతంత్య్రకాలంలో ఏర్పడిన భిన్న సంస్కృతీ సంప్రదాయాల భావన నేడు ప్రమాదంలో పడిందని చెప్పారు. మత దేశంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశాన్ని దోచుకుతింటున్న వారికి అధికారపార్టీ అండగా ఉంటున్నదని వివరించారు. బీబీసీ కార్యాలయంపై దాడి చేశారనీ, మోడీపై ఒక వార్తను ప్రసారం చేసిందనే ఉద్దేశంతో మీడియా స్వేచ్ఛను హరిస్తున్నదని వివరించారు.
ఐక్యపోరాటాలు రావాలి
బీజేపీకి వచ్చిన ఓట్లతో పోలిస్తే దాన్ని వ్యతిరేకించేవారి ఓట్లే ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకూడదని విజయన్‌ అన్నారు. హిందూత్వ శక్తులపై విజయం సాధించాలంటే ప్రజల జీవనోపాధి సమస్యల ఆధారంగా ఐక్య పోరాటాలు రావాల్సి ఉందని తెలిపారు. వ్యవసాయ కార్మికులు, రైతులు జాతీయ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, భవిష్యత్‌లో నిర్వహించే పోరాటాల్లో వారిపాత్ర కీలకమని అన్నారు. ఇటువంటి కీలక తరుణంలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ నూతన పోరాటానికి, రాజ్యాంగాన్ని కాపాడేందుకు నాంది పలుకాలని చెప్పారు.
ఏప్రిల్‌లో చలో ఢిల్లీ
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ మాట్లాడుతూ కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. పెద్దఎత్తున కలిసి రావాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు విజయరాఘవన్‌ మాట్లాడుతూ.. కేరళ పాలనను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు, అక్కడ సామాన్య ప్రజలకు రక్షణ ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం, ఏఐకేఎస్‌ నాయకులు బిమన్‌బసు, వ్యవసాయ కార్మిక సంఘం బెంగాల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమియపాత్రో తదితరులు పాల్గొన్నారు.

Spread the love