– బీజేపీ బలం పడిపోతోంది ఇండియా బ్లాక్‌కు ఆదరణ పెరుగుతోంది
– కాషాయ పార్టీ మత సమీకరణకు ప్రయత్నిస్తోంది
– రాజ్యాంగం, లౌకిక విలువలకు విఘాతం కలుగుతోంది
– రాజ్యాంగ నియమాలను నీరుకారుస్తున్నారు
– బీజేపీ సవాలును ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉంది
– ‘ది హిందూ’ ఇంటర్వ్యూలో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
న్యూఢిల్లీ: ఇండియా బ్లాక్‌లో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ నేత ఎవరన్నది ముఖ్యం కాదని, అనుసరించే ప్రత్యామ్నాయ విధానాలే (నీతి) ముఖ్యమని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో బీజేపీ బలపడలేదని, ప్రజలు ఇండియా కూటమికే చేరువ అవుతున్నారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగే అవకాశమే లేదని, వాస్తవానికి అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ బలం తగ్గిపోయిందని చెప్పారు. ప్రధాని మోడీ, ఇతర బీజేపీ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో ప్రజా సమస్యలను ఏ మాత్రం ప్రస్తావించడం లేదని విమర్శించారు. మతపరమైన సమీకరణ కోసం బీజేపీ ఎత్తుగడలు పన్నుతోందని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగు దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ‘ది హిందూ’ పత్రికకు ఏచూరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
ప్రజలు మాకు చేరువ అవుతున్నారు. నాలుగు దశల పోలింగ్ తర్వాత ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్న మాట నిజమే. దీనికి ఓ ప్రాతిపదిక ఉంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయలేదు. గత రెండు ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ అనుకూలంగా జరిగింది. ఇప్పుడది లేదు. ఇది మొదటి సూచిక. ఇక రెండోది… ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను పక్కనపెట్టి నరేంద్ర మోడీ, ఇతర బీజేపీ నేతలు లేవనెత్తిన అంశాలేవీ వాస్తవానికి ప్రజలను ఆకర్షించలేదు. ఉదాహరణకు మీ ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ధారాదత్తం చేస్తారని, మీ రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇస్తారని, హిందూ మహిళల మంగళసూత్రాలు తీసుకొని ముస్లింలకు అప్పగిస్తారని… చేసిన ప్రచారం ప్రజలకు పట్టలేదు. ధరల పెరుగుదల, జీవనోపాధి, రోజువారీ సమస్యలను గురించే వారు మాట్లాడుతున్నారు. 90 శాతం మంది ప్రజలు తమ మనుగడ కోసం అప్పులు చేస్తున్నారని మీరు ఊహించగలరా? కుటుంబ పొదుపు బాగా పడిపోయింది. అదే సమయంలో కుటుంబ అప్పు గరిష్ట స్థాయికి చేరింది. ఇవి మనుగడకు సంబంధించిన నిజమైన సమస్యలు. అయితే వీటిని ప్రధాని ప్రస్తావించ లేదు. ప్రజా సమస్యలను ప్రధాని పట్టించుకోకపోవడం ప్రతిపక్షాలకు ఉపయోగపడుతోంది. ప్రచారంలో మేము ప్రస్తావిస్తున్న అంశాలతో ప్రజలు ఇండియా కూటమికి బాగా చేరువవుతున్నారు.
బీజేపీ బలం తగ్గుతోంది
అనేక రాష్ట్రాల్లో బీజేపీ బలం పడిపోతోంది. దక్షిణ భారతదేశంతో మొదలు పెడదాం. 2019 ఎన్నికల్లో కర్నాటకలోని 28 స్థానాల్లో బీజేపీ 25 గెలుచుకుంది. అంటే తన బలాన్ని పూర్తి స్థాయిలో కనబరిచింది. ఇప్పుడది తగ్గుతుంది. మహారాష్ట్రలో ఆ పార్టీ కొన్ని సీట్లు నష్టపోతుంది. గుజరాత్‌లో సైతం అదే పరిస్థితి. రాజస్థాన్‌లో కచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. హర్యానాలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తుండడంతో ప్రతిపక్షాలు లాభపడతాయి. ఉత్తరప్రదేశ్‌లో సైతం బీజేపీ కొంత నష్టపోతుంది. బీహార్‌లో 2019లో గెలుచుకున్న స్థానాలను (40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏ 39 సీట్లు గెలుచుకుంది) తిరిగి దక్కించుకునే అవకాశాలు లేవు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కమలదళం బలం తగ్గిపోతుంది. బెంగాల్‌లో గత ఎన్నికల్లో గరిష్ట స్థాయిలో సీట్లు వచ్చాయి. ఇప్పుడు అంతకుమించి వచ్చే పరిస్థితి లేదు.
వారివన్నీ ప్రగల్భాలే
2004లో వామపక్ష పార్టీలు 61 స్థానాలు గెలుచుకొని కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు కొందరు 2004, 2024 మధ్య పోలిక తెస్తున్నారు. కానీ అలా ఉండదు. అయితే రెండు ఎన్నికల మధ్య ఓ సామీప్యత ఉంది. అప్పుడు షైనింగ్ ఇండియా, ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్, ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి మీలో ప్రత్యామ్నాయం ఎవరు వంటి అంశాల పైన ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అని. మేము విశ్వగురువులం అయ్యాము, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాము అని వారు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ప్రగల్భాలే. వారి వాదనలేమిటి, వాస్తవ ఫలితమేమిటి అనేదే ప్రజలు చూస్తారు. 2004లో అయినా, 2024లో అయినా అదే ముఖ్యమైన విషయం.
ప్రత్యామ్నాయ విధానాలే ముఖ్యం
మోడీని ఎదుర్కొనే వారు ప్రతిపక్షంలో ఎవరు ఉన్నారని కొందరు ప్రశ్నించవచ్చు. భారత రాజకీయాల్లో ఇలాంటివి సహజమే. 2004లో కూడా ఇదే సమస్య ఎదురైంది. కానీ మీకు డాక్టర్ మన్మోహన్ సింగ్ రూపంలో ఒక ప్రధాని లభించారు. ఆయన ఓ దశాబ్దం పాటు దేశాన్ని నడిపారు. మేము ఏమంటున్నామంటే మీరు ముందుగా మీ ఎంపీని ఎన్నుకోండి. మెజారిటీ ఎంపీలు నాయకుడిని ఎంచుకుంటారు. మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అనేది ముఖ్యమని నేను అనుకోవడం లేదు. నేను తరచూ హిందీలో ఒక మాట చెబుతుంటాను. దేశానికి నేత (నాయకుడు) కాదు. నీతి (విధానాలు) అవసరం.
మత సమీకరణ పనిచేసినా…
ప్రజల రోజువారీ జీవన పరిస్థితులు, వారి ఇబ్బందులే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలని నేను భావిస్తాను. అయితే వీటిని బీజేపీ పక్కదారి పట్టించింది. హిందూత్వ ఓటును సంఘటితం చేయడం ద్వారా బలాన్ని పెంచుకోవచ్చునన్న ఆశతో మతపరమైన సమీకరణకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. సమీకరణ పనిచేస్తుంది. కానీ దాని ప్రభావం జీవనోపాధి సమస్యను పూర్తిగా తొలగించలేదు.
లౌకిక విలువలను హరిస్తున్నారు
మనది లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్ అని మన రాజ్యాంగం చెబుతోంది. అది దాని స్వభావం. కానీ లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్‌లో ప్రధానమంత్రి, ప్రధాని కార్యాలయం, భారత ప్రభుత్వం ఒక మందిర నిర్మాణంలో పూర్తిగా మమేకమైపోవడం మీరు ఎప్పుడైనా చూశారా? తమకు ఇష్టమైన విశ్వాసాలను అనుసరించేందుకు ప్రజలకు రాజ్యాంగం ప్రాథమిక హక్కు కల్పించింది. ప్రభుత్వం ఒక మతాన్ని గురించి ప్రచారం చేయకూడదు. లేదా ఇతరులపై దానిని రుద్దకూడదు. కానీ మన దేశంలో జరుగుతున్నది అదే. లౌకిక విలువలు పూర్తిగా అణచివేతకు గురవుతున్నాయి. లవ్ జిహాద్, గో సంరక్షణ, ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు పూర్తిగా లౌకికవాద పునాదులపై దాడికి ఉద్దేశించినవి. ప్రజాస్వామ్యాన్నే తీసుకోండి. చార్జిషీటు దాఖలు చేయకుండా జైళ్లలో ఎన్ని సంవత్సరాలు మగ్గిపోవడం లేదు? అసమ్మతినే జాతి వ్యతిరేకతగా పరిగణిస్తే మీ పౌర స్వేచ్ఛలు, ప్రజాస్వామిక హక్కులు ఏమవుతాయి?
రాజ్యాంగాన్ని నీరుకారుస్తున్నారు
రిజర్వేషన్లను నేరుగా మార్చకపోవచ్చు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలను, విద్యను ప్రయివేటీకరించడం ద్వారా రిజర్వేషన్ల ప్రభావం లేకుండా చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలను జైలుకు పంపే ధోరణి పెరిగిపోతోంది. ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వకుండా ప్రత్యర్థులకు ఆదాయపన్ను నోటీసులు ఇస్తున్నారు. ఇదంతా రాజ్యాంగాన్ని నీరుకార్చడమే తప్ప మరొకటి కాదు.
రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎన్నడూ లక్ష్యంగా చేసుకోలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దురదృష్టకరం. ఆ రాష్ట్రంలో మాకు ప్రత్యర్థిగా ఉన్న యూడీఎఫ్ మా ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దాడులు చేస్తోంది. ప్రజా సమస్యలు, విధానాలపై పోటీ పడితే అర్థం చేసుకోవచ్చు. మాకు ఎంతటి రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగము.
బెంగాల్ వివాదం రాజకీయపరమైనది
బెంగాల్‌లో వామపక్షాలు-కాంగ్రెస్ కూటమికి, తృణమూల్ కాంగ్రెస్‌కు మధ్య నెలకొన్న వివాదం రాజకీయాలకు సంబంధించింది. బెంగాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరును చూశాము. ప్రజాస్వామ్యం ఖూనీ అయిన తీరును గమనించాం. ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస, అవినీతి జరిగాయి. దానికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాడాయి. తృణమూల్‌తో కలిసి పోటీ చేయడం ప్రత్యామ్నాయం కాదు. వామపక్షాలు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కలిసిన మరుక్షణమే బీజేపీ బలపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం ఆ పార్టీకి లాభిస్తుంది. కాబట్టి బెంగాల్‌లో ఇండియా కూటమి పక్షాలు కలిస్తే లాభపడేది బీజేపీయే.
ఆ సవాలును ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొంటాయి
బీజేపీతో నేరుగా పోటీ పడిన సందర్భాల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలు నిరుత్సాహకరంగా ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే ఈ సవాలును ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొంటాయి. బీహార్‌నే తీసుకోండి. అక్కడి ప్రాంతీయ పార్టీ ఆ పని చేస్తోంది. మహారాష్ట్రలో కూడా అక్కడి పార్టీలు బీజేపీతో తలపడుతున్నాయి. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే కాంగ్రెస్‌ను కర్నాటక కాంగ్రెస్ లేదా తెలంగాణ కాంగ్రెస్‌గా చూడవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏ పాత్ర అయితే పోషిస్తున్నాయో అక్కడ కాంగ్రెస్ ఆ తరహా పాత్ర పోషిస్తోంది. అనేక ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, వామపక్షాల కలయిక మంచి ఫలితాన్ని ఇచ్చింది.
బర్రక్‌పుర్‌లో ఏచూరి ప్రచారం
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. బర్రక్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి దేవదత్ ఘోష్‌కు మద్దతుగా శుక్రవారం జరిగిన బహిరంగసభలో ఏచూరి ప్రసంగించారు. మతోన్మాద బీజేపీని, నిరంకుశ తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించి వామపక్ష, ప్రగతిశీల అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో దేవదత్ ఘోష్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు గార్జి ఛటర్జీ, సోమనాథ్ భట్టాచార్య తదితరులు ప్రసంగించారు.