తగ్గేదేలే..!

It will decrease..!— మంత్రి, మాజీ మంత్రి మాటకు మాట
– పోటాపోటీగా విమర్శలు.. ప్రతివిమర్శలు
–  పువ్వాడ, తుమ్మల పరస్పర ఆరోపణలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఖమ్మం నియోజకవర్గంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా భావిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తనదైన శైలిలో పువ్వాడ విమర్శలు చేస్తుంటే…దానికి దీటుగా తుమ్మల ప్రతిస్పందిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గత ఆదివారం తుమ్మల నిర్వహించిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌ దగ్గర నుంచి మంత్రి అజరు నాలుకకు పదును పెట్టారు. అదే రీతిలో తుమ్మల కూడా కౌంటర్లు మొదలుపెట్టారు. ఇద్దరు కూడా రాష్ట్రవ్యాప్తంగా పేరున్న నేతలు కావడం, ఒకే సామాజిక తరగతికి చెందినవారు అవడంతో వీరి మాటలు రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశమ య్యాయి.
బందిపోట్ల దగ్గర మొదలు…
పొంగులేటి, తుమ్మల స్ట్రింగ్‌ ఆపరేషన్‌ సమయంలో పువ్వాడ హైదరాబాద్‌లో బీఫామ్‌ తీసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో బందిపోట్లలా వచ్చి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఓ నలుగురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి వారిని కాంగ్రెస్‌లోకి స్వాగతించారు. అనంతరం వారిని తోడ్కొని హైదరాబాద్‌ వెళ్లి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేర్పించారు. నాటి నుంచి మంత్రి మాటల యుద్ధానికి తెరదీశారు. ఓ బీఆర్‌ఎస్‌ నేత ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల, పొంగులేటిలను బందిపోట్లలా అభివర్ణించారు. కేసీఆర్‌ రాజకీయంగా అనేక అవకాశాలను వీరిద్దరికి ఇచ్చారని, అయినా తుమ్మల తాను ఓడిపోవడమే కాక మిగిలిన 8 మందిలో ఒక్కర్నీ గెలిపించలేదని, తాను ఒక్కడినే గెలిచానని పువ్వాడ చెప్పుకొచ్చారు. దీనిపై మాజీ మంత్రి, మాజీ ఎంపీ దీటుగా స్పందించారు. బందీపోట్లను తయారు చేసింది ఎవరని ప్రశ్నించారు. ఐదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఖమ్మంలో నెలకొన్న పరిస్థితులను తుమ్మల ఏకరువు పెట్టారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్య్రంతో జీవించారని వ్యాఖ్యానించారు. పువ్వాడ మంత్రిగా ఉన్న నాలుగున్నరేండ్లలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ.. అవినీతి, అక్రమార్కులు, కబ్జాకోరులు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. వ్యాపారస్తులు, ఉద్యోగులు పైసా పైసా పోగేసుకుని కొనుగోలు చేసుకున్న ప్లాట్లు, స్థలాలకు భద్రత కరువైందన్నారు. మొత్తమ్మీద మంత్రి పువ్వాడ కాలంలో అశాంతి నెలకొందని తుమ్మల కౌంటర్‌ ఇచ్చారు. పువ్వాడ పాలనను రజకారు ఖాసీం రజ్వి పాలనతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై అజరు ఆదివారం మరోసారి స్పందించారు.
మరోసారి విరుచుకుపడిన మంత్రి..
పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన తుమ్మల ప్రస్తుత రాజకీయ, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఖమ్మం నియోజకవర్గానికి షిఫ్ట్‌ అయ్యారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న పువ్వాడ నాటి నుంచి తుమ్మలపై విమర్శలకు తెరదీశారు. అజరు వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్‌ ఇస్తూనే.. మరికొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పువ్వాడ మరోసారి బీఆర్‌ఎస్‌కేవీ ఆటో యూనియన్‌ సమావేశంలో తుమ్మలపై విరుచుకుపడ్డారు. ఖమ్మంలో తుమ్మల ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సమయంలో చేసిన రాజకీయ హత్యలు అన్నీఇన్నీ కావన్నారు. ఎందర్నో రాజకీయ సమాధి చేశారని వ్యాఖ్యానించారు. రౌడీయిజం, రౌడీషీటర్లను ప్రోత్సహించింది మీరు కాదా అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్‌ను మోసం చేసి చంద్రబాబు దగ్గరకు వెళ్లావని, చంద్రబాబు దగ్గర మంత్రి పదవి పొంది.. ఆయన్ను మోసం చేసి కేసీఆర్‌ దగ్గరకు వచ్చి.. ఇక్కడా మంత్రి పదవి పొంది.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరావని విమర్శించారు. ఏదీ నీ నిజాయితీ, ఏదీ నీ నిబద్ధత, ఏదీ నీ నికార్సుతనం’ అంటూ పువ్వాడ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నగర ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ మాటలయుద్ధం పువ్వాడ, తుమ్మలకు మాత్రమే పరిమితం కాకుండా ఇరుపార్టీల కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో నూతనంగా చేరిన నేతల వరకు కొనసాగుతోంది. ఎన్నికలు ముగిసే వరకు కూడా ఈ మాటల యుద్ధం ఆగకపోవచ్చని విమర్శకులు భావిస్తున్నారు.

Spread the love