Thursday, June 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిదొంగే దొంగని…

దొంగే దొంగని…

- Advertisement -

కుంటి సాకులతో మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులకు తెగబడింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. తమ నిఘా హెలికాఫ్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందనే సాకుతో ఈ పని చేస్తున్నది. తాము కావాలని కూల్చలేదని టెహరాన్ చెబుతున్నా వినిపించుకోకుండా విధ్వంసానికి పాల్పడింది. దానికి ప్రతిగా సహజంగానే ఇరాన్ కూడా పద్దెనిమిది అమెరికా స్థావరాల మీద క్షిపణులతో బదులు తీర్చుకుంది. ఇరాన్‌పై మిలిటరీ చర్యలకు అధ్యక్షుడి అధికారాలకు అమెరికా ప్రజాప్రతినిధుల సభ కత్తెర వేస్తూ తీర్మానించటానికి ముందే పార్లమెంటును, యావత్ ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తూ ఆత్మరక్షణ దాడులని చెప్పటం దొంగేదొంగ అని అరచిన గూండాయిజం తప్ప ఇది మరొకటి కాదు. ఏకపక్షంగా కుంటిసాకులతో ముందుగా దాడులను ప్రారంభించిందే అమెరికా-ఇజ్రాయిల్‌ కూటమి. ఒక దేశం మీద అమెరికా మిలిటరీ యుద్ధం చేయాలంటే పార్లమెంటు అనుమతి అవసరం. అది లేదు గనుక తనకున్న పరిమిత అధికారాలతో మిలిటరీ చర్య ముసుగులో యు‌ద్ధం చేస్తున్నాడు. దానికీ అవకాశాలు మూసుకుపోవటంతో ఆత్మరక్షణ అంటున్నాడు.

అసలు అమెరికాకు ఆసియాలోని హార్ముజ్ జలసంధితో పనేమిటి? అక్కడికి మిలిటరీని దించాలని ఐరాస ఏదైనా తీర్మానం చేసిందా? ఇరాన్ ఒకవేళ గతంలో తాను అంగీకరించిన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించిందా? అదీ లేదు. అయినప్పటికీ అది అణుబాంబులను తయా రు చేసే కార్యక్రమంతో ముందుకు పోతున్నందున దాడులు చేశామని చెప్పటానికి అమెరికాకు ఉన్న హక్కేమిటి? అణుకార్యక్రమంపై ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నది వాషింగ్టన్, దాన్ని ఉల్లంఘించిందీ అదే, ఏడేండ్ల తరువాత అణుశుద్ది చేస్తున్నదంటూ 2025జూన్‌లో పన్నెండు రోజులపాటు దాడులు చేసి అలాంటి కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేశామని చెప్పిందీ ట్రంపే. ఇప్పుడు మరోసారి వాటిని ధ్వంసం చేసేందుకు దాడులు ప్రారంభిం చినట్లు చెప్పిందీ అతగాడే, ఒకసారి నాశనం చేసినదాన్ని మరోసారి ఎలా చేస్తారు? పశ్చిమాసియాలో తనను వ్యతిరేకించే ఒక బలమైన శక్తిని దెబ్బతీయాలనే దుష్టతలంపుతో చెబుతున్న సాకులు తప్ప మరొకటి కాదు. ఐదు వారాల దాడుల్లో ఇరాన్ మిలిటరీ శక్తిని పనికి రాకుండా చేశామని, దాని ఆయుధ సంపత్తి మొత్తాన్ని నాశనం చేశామని ట్రంప్ పదేపదే చెప్పిన మాటలు తెలిసినవే.

ఇదే విధంగా ఇరాన్‌తో అదిగో ఒప్పందం కుదిరిందీ ఇదిగో రేపే సంతకాలు అన్నట్లుగా 37సార్లు సెలవిచ్చిందీ అదే పెద్దమనిషి. మంగళ,బుధవారాల్లో దాడులు చేసి మరోసారి ఇరాన్ మిలిటరీ వ్యవస్థలను దెబ్బతీసినట్లు చెప్పుకోవటానికి అమెరికా సిగ్గనిపించటం లేదా! ఇక్కడే అసలు కీలకం దాగుంది. తాజా దాడుల్లో జోర్డాన్‌లో ఉన్న అమెరికా ఎఫ్ రకం యుద్ధ విమానాలున్న కేంద్రంపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేశామని ఇరాన్ చెబుతున్నది. పంచమ విమానవాహక యుద్ధ నౌకమీద కూడా క్షిపణులను ప్రయోగించినట్లు చెప్పింది. డోనాల్డ్ ట్రంప్ ఎన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ అక్షయ పాత్ర మాదిరి టెహరాన్ క్షిపణులు, డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అమెరికన్లకు అంతుబట్టక జుట్టు పీక్కుంటున్నారు.ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడి చేయటం అంతర్జాతీయ న్యాయచట్టాలకు విరుద్ధమంటూ ఐరాసలో మనదేశం నిరసన తెలపటం సరైనదే అనుకున్నపుడు అదే చట్టాన్ని అమెరికా, ఇజ్రాయిల్‌ ఉల్లంఘించి ఇరాన్ మీద జరిపిన దాడిని ఎందుకు ఖండించలేదు? మన రూపాయలు తీసుకొని చమురు విక్రయించిన ఇరా‌న్ నుంచి 2019 నుంచి ఒకవైపు చమురు కొనుగోలు నిలిపివేశాం. ‘ఎవరినుంచైనా కొనుగోలు చేస్తాం మా మీద ఎవరూ ఆంక్షలు పెట్టలేరు’ అంటూ గంభీరమైన ప్రకటనలు మరోవైపు.

ఎందుకు నిలిపివేశారో ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? అమెరికా బెదిరింపులకు భయపడటం తప్ప మరో కారణం లేదు. అయినప్పటికీ మనతో స్నేహాన్ని కోరుకుంటున్న ఇరాన్ గతాన్ని మరచి చమురు విక్రయి స్తున్నది. వారం రోజుల్లో అమెరికా మిలటరీ మనకోసం చమురు రవాణాకు వెళుతున్న నౌకలపై అమెరికా మిలిటరీ దాడులు చేసింది.తొలి నౌకలో 24 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు, రెండవ నౌకలోని 24 మంది భారతీయుల్లో ముగ్గురిని అమెరికా బలిగొన్నది. తమ పౌరుడు ఎక్కడైనా ఇలాంటి దాడుల్లో మరణిస్తే అమెరికన్లు ఎంత యాగీ చేస్తారో తెలిసిందే. అయినప్పటికీ మన ప్రధాని మోడీ నోరువిప్పలేదు, ఇది కూడా దౌత్యంలో భాగమా, డోనాల్డ్ ట్రంప్‌కు ఆగ్రహం వస్తుందన్న భయమా! దేశం కోసం సైనికులు ప్రాణత్యాగం చేస్తేనే మాట్లాడతారా? ఇతరుల ప్రాణాలకు విలువలేదా, ఏమిటీ వైఖరి! బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తూ మనతో సహా యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్న అమెరికా వైఖరిని ఖండించకుండా దౌత్యం పేరుతో మౌనముద్ర దాల్చటం ఏమాత్రం సమర్ధనీయం కాదు. హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించటం అంటే అడ్డగోలు వ్యవహారమే. చివరికి అది మనకోసం వచ్చిన చమురు టాంకర్ల మీద కూడా దాడులకు దిగింది. ఎలాంటి ఆటంకాలు కల్పించకపోయినా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించకూడదంటూ అమెరికాతో కలసి యుగళగీతం పాడుతున్న మనం, హార్ముజ్ జలసంధిలో గూండాయిజాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -