Monday, May 18, 2026
E-PAPER
Homeఆటలురికీ పాంటింగ్ చూస్తుంటే బాధగా ఉంది: అశ్విన్

రికీ పాంటింగ్ చూస్తుంటే బాధగా ఉంది: అశ్విన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్రస్థానం దాదాపు ముగిసినట్టే. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఆ జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమణ అంచున నిలిచింది. మ్యాచ్ అనంతరం డగౌట్‌లో హెడ్ కోచ్, దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఒంటరిగా, తీవ్ర నిరాశతో కూర్చున్న దృశ్యం అందరినీ కదిలించింది. ఈ ఫొటోపై టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు. “ఈ టోర్నీలో టాప్-2లో నిలవాల్సిన జట్టు ఇలాంటి స్థితికి రావడం బాధాకరం. నేను 2018లో ఇదే కుర్చీలో కూర్చున్నాను. ఛాంపియన్ జట్లేవీ రెండు, మూడు హోం గ్రౌండ్‌లలో ఆడవు.

మొహాలీలో వరుసగా గెలిచి, మంచి ఊపు మీదున్న సమయంలో ధర్మశాలకు వచ్చి వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయారు. వారి ఓటమికి వారే కారణం” అని అన్నాడు. “మొహాలీ, ధర్మశాల పిచ్‌లకు పేస్, బౌన్స్ విషయంలో చాలా తేడా ఉంది. ఎత్తులో తేడా ఉండటంతో పిచ్ భిన్నంగా ప్రవర్తిస్తుంది. దీనివల్ల యువ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. క్రికెట్ అవసరాల కన్నా వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ధర్మశాలలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఇప్పుడు వారి పరిస్థితి వేరేలా ఉండేది. ఈ పరిస్థితికి రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంతో బాధపడతారు. కానీ, గెలవాలనుకుంటే సొంత మైదానాన్ని వదిలి ఇలాంటి తప్పులు చేయకూడదు” అని అశ్విన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -