జనశక్తి నేత కూర రాజన్న, అమర్‌ అరెస్ట్‌

Janashakti leader Kura Rajanna and Amar arrestedనవతెలంగాణ-మిర్యాలగూడ
జనశక్తి నేత కూర రాజన్న, అరుణోదయ గాయకురాలు విమలక్క భర్త అమర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం గాజువాక సమీపంలోని ఓ బత్తాయి తోటలో సమావేశం నిర్వహిస్తుండగా గురువారం మధ్యాహ్నం పోలీసులు రెక్కీ నిర్వహించి అరెస్టు చేశారు. సాయంత్రం వరకు సుమారు మూడు గంటలపాటు ఆ తోటలోనే విచారించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని డీటీఎస్‌కు తరలించారు.
అక్కడ కొద్దిసేపు విచారించాక వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎక్కడ అరెస్టు చేశారో అక్కడే ఉంచి ఇద్దరు పోలీసులను బందోబస్తు పెట్టారు. శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌కి రావాలని ముందే సూచించగా.. మధ్యాహ్న భోజనం తర్వాత వారిని జిల్లా పోలీసు అధికారుల ముందు ప్రవేశపెట్టారు.
అరెస్టు అయిన వారిలో వారిద్దరితోపాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు రైతు నాయకులు ఉన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా జరగబోయే రైతు ఉద్యమాల గురించి చర్చించేందుకు రెండ్రోజులపాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నట్టు సమాచారం. వీరిని అదుపులోకి తీసుకున్నాక బ్యాగులను తనిఖీ చేశారు. అమర్‌ బ్యాగులో ఒక లేఖ ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం.
పోలీసులు వేధింపులు అధికమయ్యాయి విలేకర్లతో రాజన్న, అమర్‌
ఈ మధ్యకాలంలో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని జనశక్తి నేత కూర రాజన్న, విమలక్క భర్త అమర్‌ ఆరోపించారు. శుక్రవారం వారు తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తాము జైలు నుంచి విడుదలయ్యాక అడుగడుగునా పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. వరంగల్‌ జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళితే అక్కడా ఇబ్బందులు పెట్టారని, ఖమ్మం జిల్లాలో కూడా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.
తమ సంఘం విద్రోహ కార్యక్రమాలు చేపట్టడం లేదని, తమ సంఘం నిషేధితం కాదని, అలాంటప్పుడు తమను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు కావాలనే వేధిస్తున్నారన్నారు.

Spread the love