జీవో 55ను వెంటనే రద్దు చేయాలి

– విద్యార్థుల నిరసన.. పరీక్షల బహిష్కరణ
– మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌వీ
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
జీవో 55ను వెంటనే రద్దు చేయాలని, కుమారి ఆంటీ విషయం లో స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. యూనివర్సిటీ సమస్యపై ఎందుకు స్పందించడం లేదని అగ్రికల్చర్‌ యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నించారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ధర్నా శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. రెండో సంవత్సరం పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థులను అడ్డుకున్నారు. యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఎలాంటి పరీక్షలూ రాయబోమని విద్యార్థులు బహిష్కరించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి పరిపాలన భవనానికి తాళం వేసి టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. విద్యార్థుల నిరసనకు బీఆర్‌ఎస్‌వీ యూత్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌ ప్రాంతాన్ని పూర్తిగా రియల్‌ ఎస్టేట్‌ హబ్‌గా మార్చడానికి సీఎం రేవంత్‌ రెడ్డి యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love