తెలుగులో తీర్పులివ్వండి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మున్సిఫ్‌ కోర్టు, సబ్‌ కోర్ట్‌, జిల్లా కోర్టుల్లో తెలుగులోనే తీర్పులు ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తులు టీ నవీన్‌రావు, నగేష్‌ భీమపాకలను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరు గౌరీ శంకర్‌ కోరారు. సోమవారం హైకోర్టులో ‘తెలుగులో తొలి తీర్పు’ పుస్తకాన్ని న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జూలూరు గౌరీశంకర్‌ మాట్లాడారు. హైకోర్టులో తొలిసారిగా తెలుగులో తీర్పు ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తోందని తెలిపారు. కిందికోర్టు నుంచి జిల్లా కోర్టువరకు తీర్పులన్నీ తెలుగులోనే ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మాతృ భాషలో తీర్పులు వస్తేనే కోర్టులు ప్రజలకు మరింత దగ్గరవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పల్లె నాగేశ్వరరావు, ప్రొఫెసర్‌ కిషోర్‌, ఉపాధ్యక్షులు కళ్యాణ్‌రావు, కార్యదర్శి ప్రదీప్‌రెడ్డి, న్యాయవాదులు వీ రామకష్ణారెడ్డి, చిక్కుడు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love