కేసీఆర్‌ పిటిషన్‌ విచారణార్హతపై తీర్పు రిజర్వు

కేసీఆర్‌ పిటిషన్‌ విచారణార్హతపై తీర్పు రిజర్వునవతెలంగాణ -హైదరాబాద్‌
భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణాలపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల్లో లోటుపాట్లును తేల్చేందుకు జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సవాల్‌ చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కేసీఆర్‌ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా? లేదా? అనే దానిపై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. రెండు పక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును సోమవారం ప్రకటిస్తామని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాథే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ చెప్పింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ, కేసీఆర్‌ పిటిషన్‌ను తొలి దశలోనే కొట్టేయాలని కోరారు. చట్ట ప్రకారమే కమిషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. కమిషన్‌ తప్పు చేయలేదన్నారు. విలేకరుల సమావేశంలో జస్టిస్‌ నర్సింహారెడ్డి ఎవరిపైనా తప్పుడు ఆరోపణలు చేయలేదనీ, ఏవిధమైన అభియోగాలు చేయలేదన్నారు. మూడో ప్రతివాదిగా హైకోర్టు రిటైర్డు చీఫ్‌ జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి వ్యక్తిగత ప్రతివాదిగా ఉన్నారనీ, ఆయనకు నోటీసులు జారీ చేయొద్దని కోరారు.
ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇవ్వబోమనీ, రెండు వైపులా వాదనలు విన్నాకే ఉత్తర్వులు ఇస్తామని కోర్టు చెప్పింది. ఏజీ వాదిస్తూ, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసు తీర్పు ప్రకారం పిటిషన్‌ను డిస్మిస్‌ చేయాలన్నారు. కమిషన్‌ విచారణ నివేదికను మాత్రమే ఇస్తుందనీ, న్యాయపరమైన ప్రక్రియలు చేపట్టదనీ, నిజ నిర్ధారణ కమిషన్‌ అడ్డుకునేందుకు నిరాకరించిందని గుర్తు చేశారు. ఆ తీర్పును పిటిషనర్‌ తరుపు న్యాయవాది తనకు అనుకూలమని ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌ను విచారణకు హాజరుకావాలని కమిషన్‌ ఈ నెల 19న రెండోసారి నోటీసు జారీ చేస్తే అది వేధింపు ఎలా అవుతుందన్నారు. ఇప్పటి వరకు కమిషన్‌ 15 మంది సాక్షులను విచారించిందనీ, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఆ సంస్థల చైర్మెన్‌గా చేసిన ప్రభాకర్‌రావు, విద్యుత్‌ శాఖ అధికారులనూ విచారించిందని తెలిపారు.
బహిరంగ విచారణ చేస్తున్నందున కొన్ని విషయాలను కమిషన్‌ వెల్లడిస్తే తప్పుకాదన్నారు. పిటిషనర్‌కు 8బి నోటీసు జారీ సబబేనని చెప్పారు.కేసీఆర్‌ తరపున సీనియర్‌ అడ్వకేట్‌ ఆదిత్య సోంధి వాదిస్తూ, గత మార్చి 14న జారీ చేసిన జీవో 9లో జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఉందనీ, ఎంక్వయిరీ కమిషన్‌ అని చెప్పి జ్యుడీషియల్‌ కమిషన్‌ వేయడం ఏమిటని ప్రశ్నించారు. కమిషన్‌ విచారణ పూర్తి కాకుండానే విద్యుత్‌ కొనుగోళ్లు, విద్యుత్‌ ధర్మల్‌ ప్లాంట్ల ఏర్పాట్ల వల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టాలొచ్చాయని నర్సింహారెడ్డి మీడియాకు చెప్పారన్నారు. కమిషన్‌ నిజ నిర్ధారణ కోసమే అయినప్పుడు ఆ విధంగా చెబితే తప్పేముందని హైకోర్టు ప్రశ్నించగా, ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ వ్యవహారంలో రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్పడం వల్ల తుది నివేదిక ఏవిధంగా ఉంటుందనేది చెప్పకనే చెప్పారని ఆదిత్య వాదించారు.
గతంలో ఒక కమిషన్‌ విషయంలో ఇదే విధంగా విలేకరులకు వివరాలు చెబితే ఇదే హైకోర్టు ఆ కమిషన్‌ను రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Spread the love