నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ వేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎనిమిది మంది ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 14 నెలల కాలంలో మూడు భారీ ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించే తీరిక సీఎం రేవంత్ రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు. రిటైనింగ్ వాల్ కూలిపోయి రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందని కేటీఆర్ తెలిపారు. ప్రమాదం జరిగి 72 గంటలు గడిచినా చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేకపోయారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఏ చిన్న సంఘటన జరిగినా లక్షల కోట్ల అవినీతి, వేల కోట్ల అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు, మేధావులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల అనుమతి తీసుకోకుండా, ఆ సంస్థ ఇంజినీర్లు గ్రీన్‌సిగల్ ఇవ్వకముందే టన్నెల్ పనులు ప్రారంభించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని కేటీఆర్ విమర్శించారు. నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణ జరిపి సుంకిశాల రిటైనింగ్ వాల్ ఎందుకు కూలింది? ఎస్‌ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కారణాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ఒకవైపు సహాయ కార్యక్రమాలను వేగవంతంగా చేపడుతూనే, ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ, ఇతర సంస్థల సహకారంతో కార్మికులను వెంటనే రక్షించేందుకు ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరారు.