‘న్యాయ’ విలాపం

”ఏడాదిన్నరగా నడిచే శవంగా బతుకీడుస్తున్నాను. ఇక జీవ రహితమైన ఈ కాయాన్ని ఇక కొనసాగించలేను. నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి నాకు అనుమతించండి” అన్న మహిళా న్యాయమూర్తి ఆవేదనా భరిత వ్యాఖ్యలు ఈ దేశ న్యాయవ్యవస్థనే ప్రశ్నిస్తున్నాయి. ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు వేధింపులు తప్పడంలేదని తరచూ రుజువ వుతూనే వుంది. చివరకు న్యాయస్థానాలు కూడా ఇందుకు మినహా యింపు కాదని మహిళా జడ్జీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ స్పష్టం చేస్తోంది. జిల్లా జడ్జి, ఆయన అనుచరుల నుంచి ఆమె ఎదుర్కొంటున్న వేధింపులు ఎలాంటివో, అవి ఎంత ఆత్మక్షోభకు గురిచేశాయో లేఖలో ఆమె వాడిన పదజాలమే పట్టిచూపుతోంది. ”సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయవృత్తిలో చేరిన నేను.. ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోంది. గత కొన్ని రోజులుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగుకంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు” అని ఒక న్యాయమూర్తే వేదన చెందుతున్న దుస్థితిలో మనం ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా తీసుకువచ్చిన ”నారీశక్తి వందన్‌” కు అర్థం పరమార్ధం ఏమిటో ఏలినవారికే తెలియాలి.
‘మీరంతా ఆటబొమ్మగా, ప్రాణరహిత పదా ర్థంగా మారటం నేర్చుకోండి’ అని మహిళలకు హితవు పలికారు. తనను రాత్రిపూట ఒంటరిగా కలవమంటూ వేధిస్తున్నారని మొన్న జూలైలో ఆమె చేసిన ఫిర్యాదుపై హైకోర్టులోని అంత ర్గత ఫిర్యాదుల కమిటీ విచారించింది. కానీ కింది ఉద్యోగులు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలంటే ఆ జడ్జిని విచారణ సమయంలో బదిలీ చేయాలన్న ఆమె వినతిని పట్టించుకున్నవారు లేరు. దీనిపై సుప్రీంకోర్టులో రిట్‌ దాఖలు చేస్తే ఈదశలో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం 8సెకన్లలోనే తోసి పుచ్చడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. ఆ పర్యవసానమే ఈ లేఖ.
నిజానికి న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం ఇదే తొలిసారి కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు జస్టిస్‌ రంజన్‌ గొగోరుపై 2019లో ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను బదిలీ చేసి, చివరకు చీటింగ్‌ కేసు పెట్టి ఉద్యోగంలో నుంచి తొలగించారు. సదరు న్యాయమూర్తిపై ఏ చర్యకూ ఉపక్రమించలేదు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లా అదనపు సెషన్స్‌కోర్టు మహిళా జడ్జి సైతం హైకోర్టు న్యాయమూర్తి నుంచి ‘నీ పని తీరు చాలా బాగుంది. నీ అందం మరింత బా గుంది’ అనటం, ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ వంటి వేదింపులను ఎదుర్కొన్నారు. ఆమె గోడు అరణ్యరోదన కావటంతో గత్యంతరం లేక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ విషాదమేమంటే ఆ ఫిర్యాదుకు అతీగతీ లేకపోయింది.
పెద్ద చదువులు చదువుకుని, ఉన్నత పదవులు వెలగబెడుతున్న వారిలో కొందరు మహిళలపై, బాలికలపై వేధింపులకు పాల్పడతున్న వారుంటారని ఇలాంటి ఘటనలు చెబుతున్నాయి. ఇలాంటి కేసుల్లో అసహాయ మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మహిళా న్యాయమూర్తులకు సైతం వేధింపు లుంటే ఇక దిక్కెవరు? కాలం మారింది. యువతులు చదువుల్లో ఎంతో ముందుంటున్నారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. వేరే వృత్తి ఉద్యోగాలను కాదనుకుని న్యాయవ్యవస్థ వైపు వచ్చేవారిలో చాలామంది సమాజానికి ఏదో చేద్దామన్న సంకల్పంతో వస్తారు. అలాంటి వారికి సమస్యలుండటం దురదృష్టకరం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆ మహిళా జడ్జి లేఖపై వెనువెంటనే స్పందించటం, అలహాబాద్‌ హైకోర్టు నుంచి నివేదిక కోరటం హర్షించదగ్గ అంశం. గతంలో మాదిరి కాక దోషులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ దుశ్శా సన పర్వం ఆగదు. మాతృహృదయ నిర్వేదం తీరదు.
తాజాగా విడుదలైన ఎన్‌సీఆర్‌బీ నివేదిక మరోసారి మాతృహృదయ నిర్వేదనను ఆవిష్కరించింది. గతేడాది దేశ వ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు చోటు చేసుకు న్నాయని, సగటున ప్రతి 51 నిమిషాలకూ ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదవుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఈ నేరాల్లో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. పని చేసే చోట మహిళలను వేధించటంలో ఢిల్లీ అగ్రస్థానంలో వుంది. నిజానికి వాస్తవ ఘటనలతో పోలిస్తే కేసుల వరకూ వెళ్లే ఉదంతాలు చాలా తక్కువ. లైంగిక వేధింపుల కేసుల్లో న్యాయమైన తీర్పులు చెప్పి, నేరగాళ్లను కఠినంగా శిక్షించి, బాధితులకు ఉపశమనం కలగజేయాల్సిన చోటే… మహిళా న్యాయమూర్తులకు వేధింపులుంటే ఇంతకన్నా ఘోరమైన స్థితి ఉంటుందా? ఈ దేశంలో మహిళా న్యాయమూర్తులకే భద్రత లేకపోతే ఈ ప్రభుత్వం ఎవరిని కాపాడుతుంది?

Spread the love