నవతెలంగాణ – హైదరాబాద్ : స్టార్ హీరో సూర్య తన ‘కరుప్పు’ సినిమా విడుదల సమయంలో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక కష్టాల గురించి తాజాగా వెల్లడించారు. సినిమా విడుదలకు చివరి నిమిషంలో అదనపు రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఆ క్లిష్ట సమయంలో తన భార్య జ్యోతిక అండగా నిలబడిందని ఆయన తెలిపారు. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో త్రిషతో కలిసి సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం 2026 మే 14న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఒకరోజు ఆలస్యమైంది. తమిళనాడులో పంపిణీకి సంబంధించిన లావాదేవీలు కొలిక్కి రాకపోవడంతో ఆ రోజు ఉదయం షోలు రద్దయ్యాయి. దీంతో సూర్య స్వయంగా రంగంలోకి దిగి, వ్యక్తిగతంగా భారీ మొత్తం చెల్లించడంతో పాటు అదనపు నిధులు సమకూర్చి మే 15న సినిమాను విడుదల చేశారు.
అనేక అడ్డంకులను దాటుకుని విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. “ఈ విషయంలో జ్యోతికకు థ్యాంక్స్ చెప్పాలి. అది చాలా పెద్ద ఆర్థిక భారం. చివరి నిమిషంలో నా మీద పడింది. నేను అదనపు రుణాలు తీసుకుంటున్నప్పుడు ఆమె నాపై నమ్మకం ఉంచింది. ఒకవేళ ఏదైనా తేడా వస్తే, కుటుంబంగా మేమంతా కష్టాలు పడాల్సి వచ్చేది. అయినా ఆమె నా నిర్ణయాన్ని నమ్మింది” అని సూర్య వివరించారు.



