కాళేశ్వరం జలానికి-లక్ష జనహారతి రికార్డ్‌

– వండర్‌ వరల్డ్‌ ఆఫ్‌ బుక్‌ రికార్డ్‌లో చోటు
– మంత్రి జగదీశ్‌రెడ్డికి మెడల్‌, ప్రశంశాపత్రం అందజేత
నవతెలంగాణ – చివ్వేంల
సూర్యాపేట జిల్లాలో బుధవారం కాళేశ్వరం జలానికి-లక్ష జనహారతి ప్రోగ్రాంకు వండర్‌ వరల్డ్‌ ఆఫ్‌ బుక్‌ రికార్డ్‌లో చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కాళేశ్వరం జలానికి లక్ష జన హారతి కార్యక్రమం ప్రకటించగానే వండర్‌ వరల్డ్‌ ఆఫ్‌ బుక్‌ సంస్థ ప్రతినిధులు అధ్యయనం నిర్వాహకులు ఐడబ్ల్యూ ఎస్‌ఆర్‌ ఇండియా చీఫ్‌ డాక్టర్‌ బి.నరేందర్‌గౌడ్‌, తెలంగాణ కో-ఆర్డినేటర్‌ ఏ.గంగాధర్‌ మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించారు. కార్యక్రమంలో లక్షా 16 వేల 142 మంది పాల్గొన్నట్టు బృందం నిర్ధారించింది. అందులో 65 వేల 42 మంది మహిళలు ఉండగా, 51,100 మంది పురుషులు పాల్గొన్నట్టు వెల్లడించారు. చివ్వేంల మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కాళేశ్వరం జలానికి- లక్ష జన హారతి కార్యక్రమం పూర్తయ్యాక నిర్వాహకులు నరేందర్‌ గౌడ్‌, గంగాధర్‌ వేదిక మీద మంత్రి జగదీశ్‌ రెడ్డికి ఘనంగా పురస్కారం మెడల్‌తో పాటూ మెమెంటో ప్రశంసాపత్రం అందజేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటు కార్యక్రమాన్ని ఆసాంతం పర్యవేక్షించిన కలెక్టర్‌ వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు.

Spread the love