సోషల్‌ మానియా…

– పార్టీలన్నింటికీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలే వేదిక…
– వాటిని విస్తృతంగా వాడుకుంటున్న వైనం
– ప్రతీ సందర్భం సద్వినియోగం
– స్వపక్షంపై పొగడ్తలు.. విపక్షంపై విమర్శనాస్త్రాలు
– ప్రకటనల స్థానంలో ట్వీట్లు- రీట్వీట్లు
– నేతల స్పందనలకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లే వేదికలు
– ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పెరుగుతున్న ప్రాధాన్యత
ఓ ఇరవై ఏండ్ల క్రితం వరకూ రాజకీయ పార్టీల ప్రచారానికి గోడల మీదల రాతలు (వాల్‌ రైటింగులు), వాల్‌ పోస్టర్లు, మైకులు వేదికలుగా ఉండేవి. ఆ తర్వాత బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు దర్శనమిచ్చాయి. తదనంతర కాలంలో రేడియోలు, టీవీలు, ఎఫ్‌ఎమ్‌ రేడియోలు కూడా ప్రచార సాధనాలుగా మారాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. సాంకేతికత నిమిష నిమిషానికి కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా పరుగులు పెడుతున్నది. జెట్‌ స్పీడుతో దూసుకుపోతున్న ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే మనుగడ సాధ్యమని అందరూ గ్రహించారు. దీనికి రాజకీయ పార్టీలు, నేతలు మినహాయింపేమీ కాదు. ఈ క్రమంలో పొలిటికల్‌ పబ్లిసిటీకి ఇప్పుడు సామాజిక మాధ్యమాలే అసలు సిసలు వేదికలవుతున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ అనేవి నేతలకు ఇప్పుడు అత్యంత క్రియాశీలకంగా మారాయి.
పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ఏకరువు పెట్టాలన్నా.. అధినేతలను ప్రసన్నం చేసుకోవా లన్నా వారికి ఇవే అత్యుత్తమ మార్గాలుగా మారాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తాజా సమాచారాన్ని క్రోడీకరించి, తమ గొప్పతనాన్ని చాటుకునేందుకు రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకూ నాయకులందరూ వాట్సాప్‌, ఫేస్‌బుక్కునే వేదికగా ఎంచుకోవటం పరిపాటిగా మా రింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించాలి.. ఎదురు దాడి చేయాలని అనుకున్నప్పుడు సదరు నేత లు ఒక ఆడియోనో లేక వీడియోనో రూపొందించి, సామజిక మాధ్యమాల్లో వేస్తు న్నారు. వాటి ఆధారం గానే పత్రికలు, ఛానళ్లు తిరిగి వార్తలను ప్రసారం చేయట మనే ఒక కొంగొత్త పరిస్థితి ఇప్పుడు తలెత్తటం గమనార్హం. ఈ క్రమంలో పత్రికా ప్రకటనలు, వాటిని మొన్నటిదాకా మోసుకొచ్చిన ఫ్యాక్సులు, ఈ మెయిళ్ల వాడకం దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. వాటి స్థానంలో ట్వీట్లు (ట్విటర్‌), రీ ట్వీట్లు ఎక్కువ య్యాయి. ఈ నేప థ్యంలో రాజకీయ నేత లు ఇలా ఒక కార్య క్రమాన్ని నిర్వహించారో లేదో.. అలా ఫొటోలు, సంబం ధిత సమాచారం సోషల్‌ మీడియాలో వచ్చిపడుతు న్నాయి. దాన్ని వైరల్‌ చేయటం కార్యకర్తల పనిగా మారింది. శాసనసభకు ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ఈ ట్రెండ్‌ మరింత జోరందుకోనుంది.
రాష్ట్రంలోనూ జోరు…
     రాష్ట్రంలోనూ ఈ సోషల్‌ మీడియా ‘మానియా…’ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దాన్ని నిర్వహించేందుకు దాదాపు అన్ని పార్టీలూ వేతనాలిచ్చి మరీ సిబ్బందిని నియమిం చుకుంటున్న పరిస్థితి. మరోవైపు అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని పార్టీలూ సామాజిక మాధ్యమాల్లో ముందుండేందుకు తహతహలాడుతున్నాయి. తమ తమ స్థాయిలో సామాజిక మాధ్యమాలను వినియోగిం చుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసుకుం టున్నాయి. ఇలా ప్రచారం చేసుకోవటంలో బీఆర్‌ఎస్‌ చాలా ముందుంది. ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్‌కు సంబంధిం చిన ప్రతీ అధికారిక సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో సంబం ధిత బాధ్యులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచు తున్నారు. దానికి ఫొటోలు, వీడియో లను జత చేసి వదులు తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడి స్థాయిలో ఆయన నిర్వహించే పర్యటనలు, సభలు, సమా వేశాలు, చేరికలు.. ఇలా ప్రతీ దాన్ని క్షణాల్లో సోషల్‌ మీడియాలో ఉంచుతున్నారు. సీఎంతోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత పాల్గొనే కార్యక్రమాలన్నింటినీ ఎప్పటిక ప్పుడు సోషల్‌ మీడియాలో వదులుతుంటారు. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. అది పుట్టిన రోజైనా, పెండ్లి రోజైనా, ఆఖరికి ఒక మొక్క నాటినా వదల కుండా అదే పనిగా పోస్టులు పెడుతూ ప్రచార మోత మోగిస్తున్నారు.
జోరు పెంచిన హస్తం…
మొన్నటి వరకూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవటంలో కొంత వెనుకబడిన కాంగ్రెస్‌…కర్నాటక ఫలితాల తర్వాత కాస్త స్పీడ్‌ పెంచింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌ తదితరుల అనుచరులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయాల నుంచి వైదొలగటం గురించి ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఇక బీజేపీ విషయానికొస్తే… ఆ పార్టీ 2014, 2019లో కేంద్రంలో అధికారంలోకి రావటానికి సోషల్‌ మీడియానే కారణం. ఆ పార్టీ సామాజిక మాధ్యమాలను వాడుకునే తీరే వేరు. అసత్యాలు, అర్థ సత్యాలను జనం మీదికి వదలటంలో ఆ పార్టీ నేతలది అందెవేసిన చెయ్యి. దానికి వారు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ చాలా పెద్దది. తమ మతతత్వ విధానాలు, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణను సమర్థించుకుంటూ ఆ పార్టీ నేతలు చేసే వాదనలు, వాగ్వాదాలు సామాజిక మాధ్యమాల్లో రచ్చకు దారితీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, ఆ పార్టీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యేలు ఈటల, రఘునందర్‌రావు తదితరులు ఎప్పుడూ వాట్సాప్‌, ఫేసుబుక్కుల్లో నానుతూనే ఉంటారు. బీజేపీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనబడటం లేదు.
ప్రజలే అసలు సిసలు
మీడియాగా లెఫ్ట్‌…
అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ రకంగా సోషల్‌ మీడియాలో హంగూ, ఆర్భాటాలతో హల్‌చల్‌ చేస్తుండగా… వామపక్షాలు మాత్రం నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలకే సామాజిక మాధ్యమాల్లో ప్రాధాన్యతనిస్తున్నాయి. గుడిసెల పోరాటం, ఐకేపీ వీవోఏలు, జేపీఎస్‌లు, విద్యుత్‌ ఆర్టిజన్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై కొనసాగుతున్న పోరాటాలకు ‘లెఫ్ట్‌ సోషల్‌ మీడియా’ అత్యంత ప్రాధాన్యనిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ అభ్యుదయ, ప్రగతిశీల భావాల వ్యాప్తికి సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ వామపక్షాలు ముందుకెళుతున్నాయి.
బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love