గతంలో ఉన్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను మోడీ అధికారంలోకొచ్చాక వస్తు సేవల పన్ను (జీఎస్టీ)గా మార్చారు. అది అమల్లోకి వచ్చిన తర్వాత పొద్దున్నే వాడే టూత్‌బ్రష్ నుంచి రాత్రి పడు కోబోయే ముందు వెలిగించే మస్కిటో కాయిల్ వరకూ దేన్నీ వదిలిపెట్టకుండా జీఎస్టీ బాదటం పరి పాటైంది. ఇడ్లీ సాంబారు మొదలుకుని హైదరాబాద్ బిర్యానీ వరకూ, ఆర్టీసీ బస్సు నుంచి ఎయిర్ బస్సు (విమానం) వరకూ దంచుడు దంచుతూ ముక్కు పిండి జీఎస్టీ వసూలు చేస్తోంది కేంద్రం. దీంతో సరుకులు కొన్నదాని కంటే ఈ పన్ను బాదుడుతోనే బెంబేలెత్తుతున్నారు ప్రజలు. ఇదంతా ఒక ఎత్తయితే…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శాసనసభలో ఇంకో దానిపైనా జీఎస్టీ వేయాలి, ఆ మేరకు పీఎం మోడీ సాబ్‌ను కోరతానంటూ ఛలోక్తులు విసిరారు. ‘అబద్ధాలు ఆడటంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సభ్యులు ఆరితేరారు. నిమిషానికో ట్వీట్, గంటకో అబద్ధం, పూటకో విమర్శలాగా ఉంది వారి వ్యవహారం, మమ్మల్ని తిట్టిపోయటమే వారు పనిగా పెట్టుకున్నారు, అందువల్ల అబద్ధాలపై కూడా జీఎస్టీ వేయాలంటూ ప్రధానికి చెబుతా, అప్పుడైనా గులాబీ పార్టీ వాళ్లు అబద్ధాలు ఆడకుంట ఉంటరేమో…’ అంటూ ప్రధాన ప్రతిపక్షంపై సెటైర్లు విసిరారు. సరే… సీఎం చెప్పింది బాగానే ఉందిగానీ, ఆయన చెప్పినట్టు అబద్ధాలపై జీఎస్టీ విధించాల్సి వస్తే… ఫస్టు బుక్కయ్యేది కమలం పార్టీయేనంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటిదాకా ఈ దేశంలో ఎవ్వరూ ఇవ్వనన్ని హామీలిచ్చి, వాటిని యధేచ్ఛగా ఉల్లంఘించి, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పింది, చెబుతున్నది కేంద్రంలోని కమలం పార్టీయే కదా? అందుకే అన్ని పార్టీల కంటే ఆ పార్టీయే ‘అబద్ధాల జీఎస్టీ’ని ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందన్నది వారి వాదన…
– బి.వి.యన్.పద్మరాజు