తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి: కందుకూరు యాదగిరి

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న జర్నలిస్టుల ను గుర్తించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని ఏవో సుదర్శన్ రెడ్డికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వాలు కొంతమందిని కొన్ని వర్గాల వారిని మాత్రమే గుర్తుపెట్టుకుని ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన మీడియాను మాత్రం మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.పత్రికల్లో టీవీలలో వచ్చిన వార్తా కథనాలను ఉద్యమ సంఘటనలను అప్పటి కేంద్ర ప్రభుత్వానికి  చేరవేసిన  మీడియానే మర్చిపోవడం బాధాకరం అన్నారు.తెలంగాణ ఏర్పాటు కాగానే జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు ఇప్పటివరకు పరిష్కరించకపోవడం విచారకరం అన్నారు.ఇదే వృత్తిని నమ్ముకొని ఎటువంటి వేతనాలు లేకుండా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ప్రత్యేక ఇంటి స్థలాలు ఇచ్చి అందులో ఇండ్లు కట్టివ్వాలని అంతే కాకుండా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి హెల్త్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు ప్రతి సంవత్సరానికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని యాదగిరి డిమాండ్ చేశారు.ప్రస్తుత ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమాలలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు సూర్యాపేట నియోజకవర్గ నాయకులు వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love