ఆయనకు చదువు లేదు… ఎందుకు కొరగాడని అందరూ వెక్కిరించారు… యాదచ్చికంగా వేదికనెక్కినప్పుడు ఆయనలోని కళాకారుడు బయటికొచ్చాడు. చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ భారం ఆయనపైనే పడింది. ఇరవైఎళ్ళ వయసులో కళామతల్లినే నమ్ముకుని తన నటనకు మెరుగులద్దుకునేందుకు విపరీతంగా శ్రమించారు. ఆ శ్రమే ఆయన్ని వెండితెరకు చేరువ చేసింది. స్వయంకషితో ఒక్కో మెట్టు అధిరోహించి కొట్లాదిమంది అభిమానులకు ఆరాధ్యుడిగా మారారు. నటుడుగా, గాయకుడుగా ఐదు దశాబ్దాలకు పైగా మకుటంలేని మహారాజుగా వెలుగొందాడు.. ఆయనే కన్నడిగుల తెరవేల్పు డా.రాజ్‌కుమార్. ఈ నెల 24 న ఆయన జయంతి సందర్బంగా ఈ వ్యాసం మీ కోసం…
చలనచిత్ర రంగంలో 1954లో తొలిసారి ‘బెదర కన్నప’ చిత్రంతో నటుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 2000లో ‘శబ్దవేది’ చివరి చిత్రం వరకు అర్ధశతాబ్దం పాటు 200లకు పైగా చిత్రాలలో నటించి, భారతదేశంలోని ప్రముఖ నటులలో ఒకరిగా గుర్తింపు పొంది, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న రాజ్‌కుమార్‌ను ఆయన అభిమానులు ‘నటసార్వభౌమ’, ‘కన్నడ కంఠీరవ’, ‘గానగంధర్వ’, ‘బంగారద మనుష్య’, ‘వర నట’, ‘రాజన్’ అనే బిరుదులు పొందిన రాజ్‌కుమార్‌ను ‘డాక్టర్ రాజ్’, ‘అన్నావ్రు’ అని ప్రేమగా పిలిచేవారు. సినిమా రంగానికి రాజ్‌కుమార్ అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1983లో పద్మభూషణ్, 1995లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందించింది. 2002వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యన్టీఆర్ జాతీయ అవార్డుతో రాజ్‌కుమార్‌ను గౌరవించింది.
డా.రాజ్‌కుమార్ 1929, ఏప్రిల్ 24వ తేదీన అప్పటి మైసూరు రాజ్యంలోని గాజనూరులో కన్నడ కుటుంబంలో జన్మించాడు. ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కర్ణాటక సరిహద్దు వెంట ఉంది. ఈయన మాతభాష కన్నడ. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. తల్లి లక్ష్మమ్మ. వీరి పెద్ద కొడుకైన రాజ్‌కుమార్ కు మొదట ‘ముత్తత్తి రాయుని’ పేరుమీద ముత్తురాజ్ అని పేరు పెట్టుకున్నారు. చదువబ్బక అయిదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి ఓ నాటకాల కంపెనీలో వేషాలు వేయడం ప్రారంభించాడు. ఓ సారి నారద పాత్రదారి సెలవు మీద వెళ్లడంతో ఆ నాటకసంస్థ ప్రత్యామ్నాయ నటుడు కోసం అన్వేషిస్తున్న సమయంలో ముత్తురాజ్ (రాజ్‌కుమార్) తానే స్వయంగా కంపెనీ ప్రతినిధిని కలిసి ఆ పాత్రను తాను పోషిస్తానని చెప్పడంతో.. మరోదారి లేక ఆ కంపెనీ ప్రతినిధి ఒప్పుకున్నాడు. అనుకోకుండా లభించిన ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకున్న రాజ్ నారద పాత్రలో ‘బాల కనకమయజల సుజన’ అంటూ తన్మయుడై పద్యాన్ని అలపించడంతో ఆహుతులు మంత్రముగ్దులై.. వన్స్ మోర్ అంటూ కరతాళ ధ్వనులతో అభినందించారు. ఆ పాత్రలో లీనమైపోయి చెప్పిన డైలాగులూ, పాడిన పద్యాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత సుబ్బయ్యనాయుడు నాటక సంస్థలో ముత్తురాజ్ (రాజ్‌కుమార్) ప్రధాన సభ్యుడయ్యాడు. ఇది ఆయన జీవితంలో ఓ మేలిమలుపు.
సినీరంగ ప్రవేశం
ఆ తర్వాతి కాలంలో ముత్తు రాజ్ ‘డా.రాజ్‌కుమార్’గా చిత్రసీమ వైపు ఆడగులు వేసి తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. గుబ్బి డ్రామా కంపెనీ తొలిసారి నిర్మించిన ‘గుణసాగరి’ చిత్రం విజయవంతం కావడంతో, తమ సంస్థ నిర్మించే రెండవ సినిమాకి కథానాయకుడి కోసం ఆ చిత్ర దర్శకుడు హెచ్.ఎల్.ఎన్. సింహా గాలిస్తున్న సమయంలో ముత్తురాజ్‌ని ఈ చిత్రానికి కథానాయకుడుగా ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనతో చిత్ర నిర్మాతలతో చర్చించగా దర్శకుడు సింహా ప్రతిపాదనను వారు అంగీకరించారు. దీంతో ‘రాజ్‌కుమార్’ అనే కొత్త పేరుతో ‘బెడర కన్నప్ప’ చిత్రంతో ముత్తురాజ్ సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఇదే సినిమాను ‘శ్రీ కాళహస్తీశ్వర మహత్యం’ పేరిట తెలుగులో నిర్మించారు.
‘డా.రాజ్‌కుమార్’ ఆ తర్వాత ‘సోదరి, భక్త విజయ, హరిభక్త, ఓహిలేశ్వరా, సతి నళాయిని, భూకైలాస, శ్రీకష్ణ గారడీ, రణదీర కంఠీరవ’ నుండి మొదలుకుని దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించారు. రాజ్‌కుమార్ ‘బంగారద మనుష్య’ చిత్రంతో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఈ చిత్రం కన్నడ సినీపరిశ్రమలో రికార్డులు సష్టించి, ఏడాదిపాటు ప్రదర్శితమైంది. ‘భక్త ప్రహ్లాద, బబ్రువాహన, సత్యహరిశ్చంద్ర’ వంటి పౌరాణిక.. ‘మయూర, వీరకేసరి’ వంటి జానపద, సంగీత ప్రధానమైన చిత్రాల్లో రాజ్‌కుమార్ తన అసమాన నటనా సామర్థ్యాలని ప్రదర్శించారు.
నట, గాయకునిగా
చిత్తూరు నాగయ్య స్ఫూర్తితో రాజ్‌కుమార్ నటగాయకునిగా సాగాలని పరితపించేవారు. రాజ్ నాటకాల్లో నటిస్తున్న సమయంలో సొంతగా పద్యాలు, పాటలు పాడుకున్నారు. ఆ అనుభవంతోనే 1956లో రూపొందిన ‘ఓహిలేశ్వర’లో ”ఓం నమశ్శివాయ” పాటను పాడారు రాజ్‌కుమార్. ఆ చిత్రానికి మన తెలుగువారయిన జి.కె.వెంకటేశ్ సంగీతం సమకూర్చారు. ఆ తరువాత రాజ్‌కుమార్ నటనకు, పి.బి.శ్రీనివాస్ గానానికి జోడీ కుదిరింది. వారిద్దరి కాంబినేషన్ కన్నడసీమలో జైత్రయాత్ర చేసింది. అయితే నటగాయకుడు కావాలన్న రాజ్‌కుమార్ అభిలాషను 1974లో రూపొందిన ‘సంపత్తిగా సవాల్’ చిత్రం తీర్చింది. ఇందులో ”యారే కూగాడలి” అనే పాట పాడి ఆకట్టుకున్నారు రాజ్‌కుమార్. ఈ చిత్రం తెలుగులో చలం హీరో గా ‘తోటరాముడు’ పేరుతో రీమేక్ అయి విజయం సాధించింది. ఇక అప్పటి నుంచీ స్వీయగానంతో నటిస్తూ సాగారు రాజ్‌కుమార్. ఆయన నోట పలు సూపర్ హిట్ సాంగ్స్ పలికి, అభిమానులను ఎంతగానో అలరించాయి. తను నటించిన చిత్రాలకే కాక, నేపధ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు. ముఖ్యంగా మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి వారిపై రాజ్‌కుమార్ పాడిన భక్తిగీతాలు తెలుగువారినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నటునిగా, గాయకునిగా రాజ్‌కుమార్‌కు ఎనలేని ఖ్యాతి లభించింది. అభినయంలో పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నా రాజ్‌కుమార్ 1992లో తాను నటించిన ‘జీవనచైత్ర’ చిత్రంలో ”నాదమయ” అంటూ సాగే పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా ఆయన అవార్డు అందుకున్నారు. ఓ పాపులర్ స్టార్‌కు బెస్ట్ సింగర్‌గా నేషనల్ అవార్డు దక్కడం అదే మొదటి సారి. ఇప్పటి వరకూ మరో స్టార్ హీరో ఈ అవార్డు సాధించలేదు.
కన్నడ సినిమా అభివద్దికి కృషి
కన్నడ సినిమా అభివద్ధికి రాజ్‌కుమార్ ఎంతగానో కషి చేశారు. మదరాసు నుండి కన్నడ చిత్రసీమను కర్ణాటకకు తీసుకువెళ్ళడంలో రాజ్ పాత్ర మరపురానిది. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లోనే ఆయన చిత్రాల షూటింగులన్నీ జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక కన్నడ చిత్రాలకు తెలుగు, తమిళ సినిమాల ద్వారా పెద్ద పోటీ ఉండడంతో, తమ సినిమా ఉనికిని చాటుకొనేందుకు కన్నడ చిత్రాలకు ‘యాభై శాతం పన్ను మినహాయింపు’ తీసుకు రావడంలోనూ రాజ్‌కుమార్ పాత్ర ఎంతో ఉంది. పన్ను రాయితీ కారణంగానే రాజ్‌కుమార్ చిత్రాలు బెంగళూరులో పరభాషా చిత్రాలకు పోటీగా నిలదొక్కుకొని ‘బంగారుద మనుష్య, శంకర్ గురు’ వంటి చిత్రాలు సంవత్సరం పైగా ప్రదర్శితమయ్యాయి. సినిమా రంగానికి రాజ్‌కుమార్ అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1983లో పద్మభూషణ్, 1995లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందించింది. 2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యన్టీఆర్ జాతీయ అవార్డుతో రాజ్‌కుమార్‌ను గౌరవించింది. కన్నడ రాజ్‌కుమార్‌గా భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నా రాజ్‌కుమార్‌కు తెలుగువారి మదిలోనూ ఓ ప్రత్యేక స్థానం ఉందని చెప్పక తప్పదు.
తెలుగువారంటే రాజ్‌కు అభిమానం
అంతకు ముందు కన్నడ సీమలో కొందరు రంగస్థల నటులు రాజ్యమేలారు. రాజ్‌కుమార్, కళ్యాణ్ కుమార్, ఉదరు కుమార్ ముగ్గురూ కన్నడ చిత్రసీమలో తమదైన బాణీ పలికించారు. ఈ ముగ్గురినీ ‘కన్నడ చిత్రసీమ త్రిమూర్తులు’ అని పిలిచేవారు. అయితే వారిలో అత్యధిక కాలం స్టార్‌గా వెలుగొందింది మాత్రం రాజ్‌కుమార్ అనే చెప్పాలి. ‘కాళహస్తి మహాత్మ్యం’లో తనని ఎంతగానో ఆదరించిన తెలుగువారంటే రాజ్‌కుమార్‌కు ఎంతో అభిమానం. ఇక ఆయన ఇష్టదైవం తెలుగునేలపై కొలువైన మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి.
యన్టీఆర్ తోనే పోటీ!
తెలుగునాట సూపర్ స్టార్స్‌గా వెలుగొందిన చిత్తూరు వి.నాగయ్య, యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అంటే రాజ్‌కుమార్‌కు ఎంతో గౌరవం. వారిలో యన్టీఆర్ అంటే మరింత అభిమానం. అందుకు కారణం లేకపోలేదు.. యన్టీఆర్ తెలుగులో నటించిన అనేక చిత్రాలు కన్నడలో రాజ్‌కుమార్ హీరోగా రీమేక్ అయ్యాయి. అంతేకాదు, యన్టీఆర్ లాగా తానూ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో నటించి కన్నడ వాసులను అలరించారు రాజ్‌కుమార్. యన్టీఆర్ నటించిన ‘పెళ్ళిచేసి చూడు, సత్య హరిశ్చంద్ర, భూకైలాస్, బందిపోటు, కదలడు- వదలడు” చిత్రాలు కన్నడ రీమేక్స్ లో రాజ్‌కుమార్ నటించారు. యన్టీఆర్ నటజీవితంలో తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘కులగౌరవం’. ఈ చిత్రానికి కన్నడలో రాజ్‌కుమార్ నటించిన ‘కులగౌరవ’ ఆధారం. యన్టీఆర్ లాగే కన్నడనాట శ్రీరామ, శ్రీకష్ణ వంటి దేవతామూర్తుల పాత్రల్లో నటించి, రావణ, హిరణ్యకశ్యప, కంస, శిశుపాల వంటి ప్రతినాయక పాత్రల్లోనూ అలరించారు రాజ్‌కుమార్. ఇక బెంగళూరు, బళ్ళారి, హోస్పేట్, రాయచూర్ వంటి కేంద్రాలలో యన్టీఆర్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఆ యా ప్రాంతాల్లో యన్టీఆర్‌తో పోటీగా రాజ్‌కుమార్ సినిమాలు విడుదలయ్యేవి. వారిద్దరి మధ్యనే కన్నడవాసులు పోటీ ఉందని భావించేవారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు ఘనవిజయాలు చూశాయి. అక్కడ తమిళ స్టార్ హీరోస్ ఎమ్జీఆర్, శివాజీగణేశన్ చిత్రాలు విడుదలైనా, ఎందుకనో అభిమానులు రామారావునే రాజ్‌కుమార్‌కు పోటీగా భావించేవారు. అయితే, రాజ్‌కుమార్ మాత్రం యన్టీఆర్‌ను తన అన్నలాగే అభిమానించేవారు. మరో విశేషమేమంటే, రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్ కుమార్, యన్టీఆర్ నటవారసుడు బాలకష్ణ నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇక రాజ్‌కుమార్ మరో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ చిత్రంలో జూనియర్ యన్టీఆర్ ”గెలెయ గెలెయా..” అంటూ సాగే కన్నడ పాట పాడి ఆకట్టుకున్నారు.
తెలుగు నటులతో చిత్రబంధం!
కన్నడలో రాజ్‌కుమార్ నటించిన ‘సంత తుకారాం’ను ఏయన్నార్‌తో ‘తుకారాం’గా తెరకెక్కించారు. ‘భక్త కుంబార’ చిత్రాన్ని తెలుగులో అక్కినేనితో ‘చక్రధారి’గా రూపొందించారు. రాజ్‌కుమార్ ‘శ్రావణబంతు’ ఆధారంగా ఏయన్నార్ ‘వసంతగీతం’ వచ్చింది. ఏయన్నార్ ధరించిన సత్యవంతుడు, కాళిదాసు వంటి పాత్రలను రాజ్‌కుమార్ కూడా పోషించడం గమనార్హం! రాజ్‌కుమార్ చిత్రాలను తరువాతి తరం హీరోలయిన కష్ణ, శోభన్ బాబు, కష్ణంరాజు కూడా రీమేక్ చేశారు. రాజ్‌కుమార్ కెరీర్ లోనే కాదు, కన్నడ నాట అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా ‘బంగారద మనుష్య’ నిలచింది. ఈ చిత్రం ఆధారంగా తెలుగులో కష్ణ ‘దేవుడు లాంటి మనిషి’ రూపొందింది. రాజ్‌కుమార్ ‘శంకర్ గురు’నే కష్ణ ‘కుమార రాజా’గా తెరకెక్కింది. రాజ్‌కుమార్ నటించిన ‘సనాది అప్పన్న’ తెలుగులో శోభన్ బాబుతో ‘సన్నాయి అప్పన్న’గా, ‘చెలుసువే మోడగళ్’ ఆధారంగా ‘రాజ్‌కుమార్’ రూపొందాయి. కష్ణంరాజు హీరోగా రూపొందిన ‘పులిబిడ్డ’కు రాజ్‌కుమార్ నటించిన ‘తాయిగె తక్క మగ’ మాతక. పాటలతో పులకింప చేసిన రామకష్ణ ‘పూజ’ సినిమాకు రాజ్‌కుమార్ ‘ఎరడు కనసు’ మాతక. ఇలా పలువురు తెలుగు సినిమా స్టార్స్ రాజ్‌కుమార్ చిత్రాల రీమేక్స్ తో సాగారు.
విశ్వవిఖ్యాత కన్నడ నట సార్వభౌమ
ఆయన కన్నడ చలనచిత్రాలలో పోషించని పాత్రే లేదు అంటే అతిశయోక్తి కాదు. విశ్వవిఖ్యాత కన్నడ నట సార్వభౌమ అంటే ‘ప్రపంచం’ లోని కన్నడిగులందరికీ తెలిసిన నటుడు అని. మన తెలుగునాట ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ’ అంటే నందమూరి తారక రామారావు కదా! ఆయనకు టి.సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన బిరుదు. ఇంతకుముందు రాజ్‌కుమార్ విషయంలో లాగే విశ్వ అనే పదానికి ప్రపంచం అని తీసుకున్నట్టుగా ఈయన విషయంలో కూడా ప్రపంచమనే తీసుకోవాలి. ప్రత్యేకించి రాజ్‌కుమార్ ఉపయోగించినట్టుగా తెలుగు నట సార్వభౌమ అని ఎన్టీఆర్‌ని అనడం ఆయనను తక్కువ చేయడమే అవుతుంది. ఎందుకంటే తమిళ చిత్రాలకు కూడా కొన్ని కీలకపాత్రలు ఆయనే కావలసి వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎన్ని భాషాల పేర్లని చేర్చగలం? కాబట్టి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని ఉపయోగించడం దోషం లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా రాజ్‌కుమార్ ఉదాహరణ లాగే ‘విశ్వం’ అంటే ప్రపంచమని, బిరుదు తెలుగువారికి అర్థమవుతుంది కాబట్టి తెలుగువారి ప్రపంచంలో నట సార్వభౌముడనీ అనుకోవాలి.
రాజ్‌కుమార్ వివాహం
పదమూడేండ్ల వయసులో హైస్కూల్ లో చదువుకుంటూ, సుబ్బయ్య కంపెనీలో నాటకాలు వేస్తున్న సమయంలో రాజ్‌కుమార్‌కు పార్వతమ్మతో వివాహం జరిగింది. పెండ్లి అయ్యాకనే తన దశ తిరిగిందని రాజ్‌కుమార్ ఎప్పుడూ చెపుతుండేవారు. వీరికి ఐదుగురు సంతానం. ఈ ఐదుగురిలో శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే ముగ్గురు మగ పిల్లలు, లక్ష్మీ, పూర్ణిమ అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. రాజ్‌కుమార్ ముగ్గురు కుమారులు సినీరంగంలోనే కొనసాగుతుండగా గత రెండు సంవత్సరాల క్రితం మూడో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో మరణించాడు.
రాజ్‌కుమార్‌ను అపహరించిన వీరప్పన్
2000 జూలై 30వ తేదిన రాత్రి 9:30 ప్రాంతంలో, తమిళనాడు లోని గాజనూరు ఫాంహౌస్ వద్ద రాజ్‌కుమార్‌ని గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ పన్నెండు మంది అనుచరులతో కలిసి అపహరించాడు. గాజనూరులో రాజ్‌కుమార్ తాను కొత్తగా కట్టించుకున్న ఇంటి గహప్రవేశం కోసం జూలై 27 న అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఫాంహౌస్ పై వీరప్పన్, అనుచరులు చేసిన సాయుధ దాడిలో రాజ్‌కుమార్‌ను ఆయనతో పాటు మరో ముగ్గురిని వీరప్పన్ అపహరించి వీరిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు.
ఆ సమయంలో రాజ్‌కుమార్ విడుదల కోసం లక్షలాదిమంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలకు, ఆందోళనలకు దిగారు. తమ అభిమాన నటుడిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున గొడవలకు చేశారు.. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎస్.ఎం. కష్ణ శాటిలైట్ ఫోన్లో వీరప్పన్‌తో చర్చలు జరిపి రాజ్‌కుమార్ విడుదలకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు కొన్ని షరతులు అంగీకరించి 108 రోజుల తరువాత 2000వ సంవత్సరం నవంబరు 15వ తేదిన రాజ్‌కుమార్‌ను వీరప్పన్ విడుదల చేశారు. అయితే వీరప్పన్ నటుడు రాజ్‌కుమార్‌ని కిడ్నాప్ చేసిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మానసిక సంక్షోభానికి గురయ్యారు. ఆ సమయంలో వీరప్పన్ పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేయడానికి రాజ్‌కుమార్‌ని కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. పాత్రికేయుడు శివసుబ్రహ్మణ్యన్ రాసిన పుస్తకంలో రాజ్‌కుమార్ విడుదల కోసం మూడు విడతలుగా మొత్తం రూ.15.22 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి ఎస్.ఎం.కష్ణ ప్రభుత్వం వీరప్పన్‌కు అందజేసిందని పేర్కొన్నారు. శివసుబ్రమణ్యన్ వీరప్పన్ జీవితంపై ”లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్” అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మొత్తానికి రాజ్‌కుమార్ విడుదల తర్వాత కన్నడ సినీ పరిశ్రమ, కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
– డా. పొన్నం రవిచంద్ర,
9440077499