కరీంనగర్‌ టిక్కెట్‌ అందుకే ఆపారా?

Did you stop the Karimnagar ticket?– బీఆర్‌ఎస్‌ కీలక నేతకు కాంగ్రెస్‌ వల నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్‌ యత్నం
– బీజేపీ కీలక నేతలు సైతం కాంగ్రెస్‌కు టచ్‌లో…
– ఆసక్తి గొలుపుతున్న తెరచాటు మంతనాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో లోక్‌సభ నామినేషన్ల పర్వం మొదలైంది. కానీ కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైన కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా…ప్రస్తుతం కాంగ్రెస్‌లో కరీంనగర్‌ కహానీ మాత్రం చర్చనీయాంశమవుతున్నది. ఆ అభ్యర్థిని ఇంకెప్పుడు ప్రకటిస్తారనే చర్చ ఒకవైపు సాగుతుండగా… మరోవైపు ఆ సీటును కైవసం చేసుకునేందుకు హస్తం పార్టీ పెద్ద స్కెచ్‌నే సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాన్ని అమలు చేయడంలో భాగంగానే ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించడం లేదనే చర్చ కూడా సాగుతున్నది.
కొత్త దారికి ‘పాత స్నేహం’ బాటలు
కరీంనగర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ కీలక నేతతో ప్రభుత్వ సలహాదారు ఒకరు మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో వారిద్దరు అత్యంత స్నేహితులుగా మెలిగారు. ఆ సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి, ఆ సలహాదారున్ని రంగంలోకి దింపినట్టు సమాచారం. ఒకవైపు ఆయనతో స్నేహపూర్వకమైన చర్చలు చేస్తూనే…కాదు, కూడదంటే, సదరు నేతపై గతంలో వచ్చిన ఎన్నో ఆరోపణలపై విచారణకు కూడా వెనుకాడకూడదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఆయన కాంగ్రెస్‌లో చేరితే కరీంనగర్‌ ఎంపీ టిక్కెట్‌ ఇచ్చేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉన్నది. అభ్యర్థి ఎంపికలో అక్కడ ఎలాంటి సమస్యలు లేకపోయినా, ఆయన కోసమే ఆ టిక్కెట్‌ను మరొకరికి ఇవ్వడం లేదని వినిపిస్తోంది. మరోవైపు ఆ బీఆర్‌ఎస్‌ కీలక నేతతో చర్చలు జరపడాన్ని ఆ జిల్లాకు చెందిన మంత్రి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఆ కీలక నేత ఇప్పటికే అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడి కోట్లకు పడగలెత్తారనీ, అటువంటి నాయకుడిని చేర్చుకోవడం సరైంది కాదనే అభిప్రాయంతో మంత్రి ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే వెలిచాల రాజేందర్‌, ప్రవీణ్‌రెడ్డి టిక్కెట్‌ రేసులో ఉన్నారు. వారిలో ఒకరికి మంత్రి మద్దతు ఇస్తున్నట్టు ఆయా వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీలో ముసలం
కరీంనగర్‌లో బీజేపీని ఓడించడం ద్వారా ఉత్తర తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగేందుకు కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నది. పదేండ్లుగా బీజేపీ అధికారంలో ఉందనీ, ఐదేండ్లుగా బండి సంజరు ఎంపీగా ఉన్నా…ఆ నియోజకవర్గానికి కేంద్రం నుంచి పైసా కూడా తీసుకురాలేదనే విమర్శలున్నాయి. దీంతోపాటు కొంత మంది బీజేపీకి చెందిన బలమైన నేతలు కూడా సంజరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్లు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సంజరు ఒంటెత్తు పోకడలు కూడా స్థానిక నేతలకు నచ్చడం లేదు. అక్కడ బీజేపీ గెలుపునకు అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నా… అంతర్గతంగా ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోందనే వార్తలొస్తున్నాయి.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఈనేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు కరీంనగర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ కీలక నేతను చేర్చుకోవడం ద్వారా అటు బీఆర్‌ఎస్‌ను, ఇటు బీజేపీని ఒకేసారి దెబ్బకొట్టొచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. కాగా బీఆర్‌ఎస్‌ నేత పరిస్థితి ‘ముందు నుయ్యి…వెనుక గొయ్యి’లా తయారైంది. పార్టీ మారితే బీఆర్‌ఎస్‌ అధినేత ఏమనుకుంటారో అనే ఆందోళన…కాంగ్రెస్‌లో చేరకపోతే ముఖ్యమంత్రి, ఏం చేస్తారోననే భయం పట్టుకున్నట్టు ఆ పార్టీకి చెందిన నేత ఒకరు చెప్పారు. ఈ విషయం ఇప్పటికే అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వద్దకు చేరింది. దీంతో ఆయన మేల్కొన్నట్టు తెలిసింది. సదరు నేతలను ఆయన పిలిపించుకుని మాట్లాడినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ

Spread the love