ఈడీి విచారణకు కార్తీ చిదంబరం

న్యూఢిల్లీ : ఒక మనీలాండరింగ్‌ కేసులో విచారణ కోసం మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు కాంగ్రెస్‌ నాయకులు కార్తీ చిదంబరం హాజరయ్యారు. 2011లో కొంతమంది చైనా పౌరులకు అక్రమంగా వీసాలు మంజూరు చేశారనే అభియోగాలతో ఆయనపై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ ఈ కేసు విచారణ చేస్తోంది. గత నెల 23న కూడా ఈ కేసులో కార్తీ చిదంబరాన్ని ఈడీ విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మంగళవారం మళ్లీ సెంట్రల్‌ ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణ అధికారి ఎదుట కార్తీ చిదంబరం హాజరయ్యారు. 263 మంది చైనా కార్మికులకు వీసా మంజారు చేయడం కోసం కార్తీ రూ.50 లక్షల లంచం తీసుకున్నారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ ఆరోపణలను కార్తీ ఖండిస్తున్నారు. తన ద్వారా తన తండి, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని లక్ష్యంగా చేసుకోవడానికే ఈ కేసును నమోదు చేశారని ఆయన పేర్కొంటున్నారు. కార్తీ చిదంబరంపై ఇది మూడో మనీలాండరింగ్‌ కేసు. మిగిలిన రెండు కేసులను కూడా ఈడీనే విచారణ చేస్తోంది.

Spread the love