– పొంగులేటి, తుమ్మలను వదులుకోబట్టే మీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది
– పదవులు ఇస్తామని తడి గుడ్డతో గొంతులు కోసేది మీ కేసీయారే
– రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్
నవతెలంగాణ – సత్తుపల్లి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దురుసుగా చేసిన విమర్శలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో డాక్టర్ దయానంద్ విజయకుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన నీకు, మంత్రి పొంగులేటి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పొంగులేటిని విమర్శించే స్థాయి కూడా నీది కాదన్నారు. స్వతహాగా కాంట్రాక్టులు, వ్యాపారాలు చేస్తూ నాయకుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తిత్వం మా మంత్రి పొంగులేటిదన్నారు.
నీవు గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని ‘డాక్టర్’ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిన ఘనత మంత్రి పొంగులేటికే దక్కుతుందని దయానంద్ స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి పెద్ద తరహాగా మాజీ సీఎం కేసీఆర్ కాళ్లకు దండం పెట్టి ఆశీస్సులు మాత్రమే తీసుకున్నారన్నారు. అంతేగానీ ఎవరి కాళ్లూ పట్టుకోవాల్సిన అవసరం మంత్రి పొంగులేటికి ఎంతమాత్రం లేదన్నారు. అప్పట్లో పదవులు ఇస్తామని నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన ఘన చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ప్రజల మద్దతుతో, వారి గుండెల్లోంచి వచ్చిన ప్రజా నాయకుడు మంత్రి పొంగులేటి శీనన్న అని దయానంద్ ఉద్ఘాటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల, పొంగులేటి లాంటి ప్రజాదరణ ఉన్న నాయకులను వదులుకుని బీఆర్ఎస్ ఘోరంగా అధికారాన్ని కోల్పోయిందన్నారు. ప్రజలు ఆదరించారు కాబట్టే మా నాయకులు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించి చూపించారని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డాక్టర్ దయానంద్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను దశాబ్ద కాలం పాటు మోసం చేసింది మీ కేసీఆరేనని దయానంద్ దుయ్యబట్టారు.
ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకే పదవులన్నీ ఇచ్చినందుకే ప్రజలు బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పారని దయానంద్ విజయకుమార్ అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, నాయకులు కొత్తూరు ప్రభాకరరావు, మలిరెడ్డి మురళీరెడ్డి, మట్టా దేవజ్యోతి, జగన్నాథం శ్రీను, ఉప్పు నాగమణి పాల్గొన్నారు.



