– ఇక్కడ.. అక్కడ ఇద్దరిని ఓడించడమే లక్ష్యం
– ఎలాంటి తెలంగాణ కావాలో జనం తేల్చుకోవాలి
– అధికారం రాగానే చట్టాలుగా ఆరు గ్యారంటీలు
– ధరణిని రద్దుచేసి భూములు కాపాడతామని స్పష్టీకరణ
– ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని హామీ : రాహుల్‌గాంధీ
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/బోధన్/ వేములవాడ
” రాష్ట్రంలో దొరల తెలంగాణ- ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి.. సీఎం కేసీఆర్ కుటుంబ పాలన..పేద ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలు.. ఇక్కడి ప్రజలు ఇలాంటి పాలన కోరుకోలేదు. ఈ దొరల పాలనను అంతమొందించి ప్రజల తెలంగాణను తీసుకురావాలనేదే తమ లక్ష్యం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ కోసం అనేక మంది యువకులు బలిదానాలు చేసుకున్నారని, వారు ఇలాంటి తెలంగాణను కోరుకోలేదని తెలిపారు. ఎలాంటి తెలంగాణ కావాలో జనం తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉందని..బీజేపీ, ఎంఐఎం పార్టీలు బీఆర్‌ఎస్‌కు సహాయకారిగా ఉన్నాయని విమర్శించారు. శనివారం ఆదిలాబాద్, బోధన్. వేములవాడ కాంగ్రెస్ విజయభేరీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో రాహుల్ మాట్లాడుతూ ప్రజల తెలంగాణ అంటే ప్రభుత్వం ప్రజల చేతిలో ఉండాలని, ఈ ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేరుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో ఎస్టీలవి రూ.5500కోట్లు, ఎస్సీలవి రూ.15,500కోట్ల నిధులను దారి మళ్లించారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అవినీతిని ప్రధాని మోదీ ఎందుకు బయటపెట్టడం లేదని, మోడీ రిమోట్ తీయగానే కేసీఆర్ సైలెంట్ అవుతారని రాహుల్‌గాంధీ అన్నారు. మోదీకి కేసీఆర్, ఓవైసీ స్నేహితులని, వారిద్దరిలో ఒకరు పీఎంగా, మరొకరు సీఎంగా ఉండాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. నాపై కేసులు మోపారని, పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారని, బంగ్లాను ఖాళీ చేయించారని, నా ఇంటిని లాక్కొన్నారని అయినా నేను భయపడలేదని, సంతోషంగా తాళాలు ఇచ్చి వచ్చానని అన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ను.. అక్కడ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారంలోకి రాగానే మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటుచేసి వాటిని చట్టాలుగా మారుస్తామని రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారు. విద్వేషమనే బజారులో ప్రేమతో కూడిన దుకాణం తెరుస్తున్నామని వ్యాఖ్యానించారు.
ధరణిని రద్దుచేసి భూములు కాపాడతాం
”కేసీఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి కేసులు గానీ, కేసీఆర్ కుటుంబంపై ఎలాంటి దాడులు గాని చేయడం లేదు. వీరిద్దరి స్నేహానికి ఇదే నిదర్శనమని’ బోధన్‌లో రాహుల్ గాంధీ అన్నారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. 1200మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ నేడు కల్వకుంట్ల కుటుంబం కబంధహస్తాల మధ్య బంధీ అయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని విమర్శించారు.