నవతెలంగాణ – బాల్కొండ (మెండోరా) : బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. బుధవారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్ గామ్ చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ బార్డర్ చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.
వాహనాల తనిఖీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించడం, బ్యారికేడ్లు , హెచ్చరిక లైట్లు వినియోగించడం , వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి తనిఖీలు నిర్వహించడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్ట విరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీలలో ఆర్మూర్ ఎ.సి.పి వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ రూరల్ సి.ఐ జాన్ రెడ్డి , మెండోరా ఎస్. ఐ సుహాసిని, తదితరులు ఉన్నారు.



