ఈడీ సమన్లపై మళ్లీ కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

నవతెలంగాణ – హైదరాబాద్: విచారణకు రమ్మంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పదే పదే నోటీసులు పంపడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ వైపు ఈ సమన్లపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఈడీ తొమ్మిదో సారి సమన్లు పంపింది. దీనిపై కేజ్రీవాల్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టగా.. కేజ్రీవాల్‌ తరఫున ప్రముఖ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. వివరణ ఇవ్వాలంటూ ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన విషయంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు సహా పలు ఇతరత్రా అంశాలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించాలని పేర్కొంటూ ఈడీ తొమ్మిదోసారి సమన్లు పంపింది. ఈ నెల 21న విచారణకు రమ్మని కేజ్రీవాల్ ను పిలిచింది. దీంతో కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ ఆరోపణలకు ఈడీ సమాధానం చెప్పాలని ఆదేశించింది.

Spread the love