కేజ్రీవాల్‌ అరెస్టు

కేజ్రీవాల్‌ అరెస్టు– ఈసారి సీబీఐ
– మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను సిబిఐ బుధవారం అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టింది. మూడు రోజుల సిబిఐ కస్టడీ విధిస్తూ స్పెషల్‌ జడ్జి అమితాబ్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రోజుకు 30 నిమిషాల పాటు లాయర్‌ను కలుసుకోవడానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఇచ్చారు. అంతకు ముందు బుధవారం ఉదయం ముందుగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి కోర్టు అనుమతించింది. దీంతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేసింది. కాగా ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహర్‌ జైలుల్లో కేజ్రీవాల్‌ ఉన్నారు. కాగా, బుధవారం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ తరువాత కోర్టులో హాజరుపర్చగా.. కేేజ్రీవాల్‌ తన వాదనలను స్వయంగా వినిపించారు. ఈ కేసులో మనీశ్‌ సిసోడియా పేరు తానే చెప్పినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చిన తర్వాత సిబిఐ తమ వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకాణాలను ప్రైవేటీకరించాలని కేబినెట్‌ సహచరుడు (సిసోదియాను ఉద్దేశిస్తూ) సిఫార్సు చేశారని కేజ్రీవాల్‌ చెప్పినట్లు కోర్టుకు వెల్లడించింది. దీన్నే కేజ్రీవాల్‌ ఖండించారు. ఈ కేసులో తనను సిబిఐ గతేడాది సాక్షిగా విచారించిన విషయాన్ని కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మద్యం విధానానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అప్పుడే సిబిఐకి వెల్లడించినట్లు చెప్పారు.ఈ వాదనల అనంతరం కేజ్రీవాల్‌ను కస్టడీకి అప్పగించాలని సిబిఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. మూడు రోజుల కస్టడీకి అనుమతించింది.బుధవారం తనను సిబిఐ అరెస్టు చేయడంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను కేజ్రీవాల్‌ వెనక్కి తీసుకున్నారు.

Spread the love