కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట– బెయిల్‌ పొడిగింపు పిటిషన్‌ స్వీకరణకు సుప్రీం నిరాకరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించ లేదు. తన ఆరోగ్య పరీక్షల కోసం మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో కేజ్రీవాల్‌ జూన్‌ 2న లొంగిపోవాల్సి ఉంటుంది. అయితే సాధారణ బెయిల్‌ కోసం దిగువ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు ఉన్నందున, పిటిషన్‌ను స్వీకరించలేమని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ తన ఆరోగ్య కారణాలను పేర్కొంటూ మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యవసరం గా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఆ పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. మధ్యంతర బెయిల్‌ గడువును పొడిగించాలని మళ్లీ అరవింద్‌ కేజ్రీవాల్‌ తరపున దరఖాస్తు చేశారు. అయితే బుధవారం మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలన్న రిజిస్ట్రార్‌ దరఖాస్తును సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఆయన దరఖాస్తును తిరస్కరించింది.

Spread the love