20 మంది మంత్రులు కూడా..ఖర్గే, రాహుల్, రేవంత్ హాజరు
కేరళంలో కొలువుదీరిన యూడీఎఫ్ ప్రభుత్వం
తిరువనంతపురం: కేరళంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళ 13వ సీఎంగా వీడీ సతీశన్ సోమవారం ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. అయితే సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా వచ్చారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు.
20 మంది మంత్రులు ప్రమాణం
సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో 14 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం యూడీఎఫ్ కూటమి పార్టీలతో చర్చల అనంతరం 20 మందికి మంత్రి పదవులను ఖరారు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రమేశ్ చెన్నితాల, కే మురళీధరన్, ఎపీ అనిల్ కుమార్, సన్నీ జోసెఫ్తో పాటు ఐయూఎంఎల్‌కు చెందిన పీకే కున్హల్ కుట్టి, ఎన్ శంషుద్దీన్, కెేఎం షాజీ, పీకెే బషీర్, వీఇ అబ్దుల్ గఫూర్ ఉన్నారు. టీ రాధాకృష్ణన్ స్పీకర్‌గా, షనిమోల్ ఉస్మాన్ (మహిళ) డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేరళం ముఖ్యమంత్రి ఎవరనే దానిపై 11 రోజులపాటు ఉత్కంఠ నడిచింది. కేసీ వేణుగోపాల్, సతీశన్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నా..కాంగ్రెస్ అధిష్ఠానం కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించింది.
న్యాయవాది టు సీఎం
కొచ్చి సమీప నెట్టూర్‌లో 1964లో వీడీ సతీశన్ జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది. పదేండ్లు కేరళం హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సామాజిక కార్యకర్తగానూ పేరొందారు. కేరళం విద్యార్థి విభాగం కేఎస్‌యూతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2001 నుంచి పరావుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఐదేండ్లుగా కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.కేరళం ముఖ్యమంత్రి పదవికి ముగ్గురు సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరకు సతీశన్ వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపింది. పదేండ్లుగా కేరళలో అధికారానికి దూరమైన పార్టీని విస్తృత ప్రజాబాహుళ్యం మద్దతుతో గెలిపించడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు.
కేరళం సీఎం ప్రమాణ స్వీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



