నవతెలంగాణ – హైదరాబాద్ : బంధుమిత్రుల సాక్షిగా.. ఆనందోల్లాసాల మధ్య ఆ ఇద్దరి కల్యాణం ఎంతో వైభవంగా జరిగింది. అంతా కలిసి ది పర్ఫెక్ట్ వెడ్డింగ్ అనుకున్నారు. కానీ, ఆ బంధం పట్టుమని పది గంటలైనా గడవక ముందే విధి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆ నూతన వధూవరుల ప్రయాణం.. ఒక ఘోర హెలికాప్టర్ ప్రమాదంతో విషాదాంతమైంది. పూర్తి వివరాలోకి వెళితే..శుక్రవారం డాసన్‌విల్లే పరిసరాల్లోని ‘ది రివెరె’ వెడ్డింగ్ హాల్‌లో డేవ్, జెస్నిల వివాహం ఘనంగా ముగిసింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వేడుకలు ముగిశాక ఈ కొత్త జంట అట్లాంటా డౌన్‌టౌన్‌లోని ఒక హోటల్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ హెలికాప్టర్ ఎక్కాల్సి ఉంది.
అయితే అప్పటికే అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టమైన పొగమంచు, భారీ వర్షం కారణంగా ముందు దారి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. తాను స్వయంగా కమర్షియల్ పైలట్ కావడంతో.. “ఇలాంటి బ్యాడ్ వెదర్‌లో నేను అస్సలు ప్రయాణించను, ఇప్పట్లో టేకాఫ్ వద్దు” అని డేవ్ తన తండ్రితో గట్టిగా చెప్పాడు. కానీ, ప్రైవేట్ హెలికాప్టర్ పైలట్ మాత్రం.. “మనం కాస్త ఎక్కువ ఎత్తులో (హై ఆల్టిట్యూడ్) వెళ్దాం, ఏం కాదు” అని నమ్మబలికి రాత్రి 10:30 గంటల ప్రాంతంలో రాబిన్సన్ R66 హెలికాప్టర్‌ను గాల్లోకి లేపాడు. దురదృష్టవశాత్తూ, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ హెలికాప్టర్ డాసన్‌విల్లే నైరుతి దిశలో ఉన్న దట్టమైన అడవులు, కొండల మధ్య కూలిపోయింది.

ఈ భీకర ప్రమాదంలో హెలికాప్టర్ ముక్కలై చెట్ల మధ్య పడిపోగా.. తీవ్రంగా గాయపడిన వధువు జెస్ని ఆ శిథిలాలు, విరిగిపడిన చెట్ల కింద దాదాపు ఐదు గంటల పాటు కదల్లేని స్థితిలో చిక్కుకుపోయింది. ఆ భయానక నరకాన్ని గుర్తుచేసుకుంటూ జెస్ని మామ జార్జ్ ఫైజీ కన్నీరుమున్నీరయ్యారు. “నా కోడలు స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ దట్టమైన అడవి, శిథిలాలు ఉన్నాయి. ఆమె రొమ్ముపై నా కొడుకు డేవ్ పడిపోయి ఉన్నాడు. జెస్ని స్వయంగా నర్సు కావడంతో.. తల తాకి చూసి, గట్టిగా పిలిచింది. కానీ అప్పటికే నా కొడుకు శరీరం మంచులా చల్లబడిపోయింది.. ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి” అంటూ ఏడ్చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్ లేకపోవడం, రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో ఆరు గంటల పాటు శ్రమించి ఆఫ్‌రోడ్ వాహనాల సాయంతో రెస్క్యూ టీమ్ జెస్నిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.



