ఖమ్మం వెరీ హాట్‌

– అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
– పమ్మిలో 44.3 డిగ్రీలు నమోదు
నవతెలంగాణ-ముదిగొండ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలోనే భానుగు భగభగమండుతున్నాడు. ఉదయం 8 గంటలకే జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. మొదటి వారంలో ఎండలు ఇలా ఉంటే మే నెలలో భానుడు ఉగ్రరూపం దాల్చే ప్రమాదం పొంచిఉంది. జిల్లాలో ప్రతీ రోజు 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రోడ్లన్నీ ఉదయం 11 గంటల నుంచే నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది.
ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 44.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శనివారం ముదిగొండ మండలం పమ్మిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. జిల్లాలో వ్యాప్తంగా ఆరెంజ్‌ ఎలర్ట్‌ జారీ చేశారు. అంటే 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుంతుండటలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందని, చిన్నారులు, వద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ తగిలిన వారిలో కాళ్ల వాపులు, కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరిగితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి సత్వర వైద్యం అందించాలి.
వడదెబ్బ తగిలితే…
– వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి.
– చల్లని గాలి తగిలేలా ఉంచాలి.
– ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ద్రావణం(ఓఆర్‌ఎస్‌) తాగించవచ్చు.
– వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి.
ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పిల్లలు, వృద్ధులతో పాటు ప్రజలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరమైతే తలకు టోపి ధరించి వెళ్లాలి. చెమట రూపంలో శరీరంలోని లవణాలు బయటకు పోతాయి. అందుకే లవణాలతో కూడిన ద్రావణం తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాం. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు
– వేసవిలో డీహైడ్రేషన్‌ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. భోజనం మితంగా చేయాలి.
– ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడన/చల్లని ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించండి.
– ఆల్కాహాల్‌/సిగరేట్‌/కార్బొనేటెడ్‌ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి.
– ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్‌ గ్లాసెస్‌, తలకు టోపీ వంటివి ధరించండి.
– వేసవిలో ఉదయం/సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలి.
– వేడి వాతావరణంలో శారీరక శ్రమ కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు నీడలో ఉండేలా చూసుకోవాలి.
– ఆహారంలో ఎక్కువగా ద్రవపదార్థాలు
– నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీరదోస, కర్బూజ, తాటి ముంజలు, బీరకాయలు, పొట్లకాయలు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీని వల్ల కడుపు నిండినట్లుగా ఉండి, డైట్‌ కంట్రోల్‌ అవుతుంది.
– శీతల పానీయాలు, అధికంగా షుగర్‌ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.
– వేసవిలో ఆకలి తక్కువగా దాహం ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్‌ పాటిస్తూ కాలానికి అనుగుణంగా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరో గ్యంగా ఉండి బరువును నియంత్రించవచ్చు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.

Spread the love