కోహ్లీ రికార్డు సెంచరీ.. నేనెందుకు అభినందించాలన్న శ్రీలంక కెప్టెన్

నవతెవలంగాణ – హైదరాబాద్: వన్డే మ్యాచ్ లలో 49 వ సెంచరీ పూర్తి చేసి విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ సమం చేశారు. అది కూడా తాను అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోనే కావడం విశేషం. దీంతో కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తుండగా శ్రీలంక కెప్టెన్ కౌశల్ మెండీస్ మాత్రం భిన్నంగా స్పందించారు. సోమవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ జట్టుతో శ్రీలంక తలపడనుంది. ఈ క్రమంలో శ్రీలంక కెప్టెన్ ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోహ్లీ 49వ సెంచరీపై ఎలా స్పందిస్తారని ఓ విలేకరి మెండీస్ ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో మెండీస్ కొంత కన్ఫూజ్ కు గురయ్యాడు. ఆ తర్వాత నవ్వేస్తూ అయితే నాకేంటనే రీతిలో స్పందించాడు. కోహ్లీ సెంచరీ చేస్తే తానెందుకు ఆయనను అభినందించాలంటూ ఎదురు ప్రశ్నించాడు. కాగా, ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యం ఎక్కువగా ఉండడంతో ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకున్నాయి. శ్రీలంక జట్టు శనివారం మొత్తం ఇండోర్స్ కే పరిమితం కాగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రం మాస్క్ లు ధరించి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ప్రాక్టీస్ చేశారు.

Spread the love