కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న రింగురోడ్డు నిర్వాసితులు

– న్యాయం చేయాలని వేడుకలు
– తమ బాధను అర్థం చేసుకోవడం లేదని ఆవేదన
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
రింగ్ రోడ్డు నిర్మాణం కోసం తమ భూములను లాక్కోవద్దని కోరుతూ రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వాయ్ ని ఆదివారం నిర్వాసితులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. కనగల్ మండలం ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ దేవి బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న వెంకటరెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు. రెండు నెలలుగా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా ఎవరు తమకు న్యాయం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలైన్మెంట్ 3 ప్రకారం కాకుండా అలైన్మెంట్ 1 ప్రకారం రింగురోడ్డును నిర్మించి తమ ఇండ్లకు, ప్లాట్లకు రక్షణ కల్పించాలని నిర్వాసితులు మంత్రి వెంకటరెడ్డిని వేడుకున్నారు. అయితే ఇప్పటికే రోడ్డు నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి చెప్పడంతో నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా…
(కవిత, కేశరాజు పల్లి, భూనిర్వాసితురాలు)
అలైన్మెంట్ 3 ప్రకారం రింగ్ రోడ్డు నిర్మిస్తే మంత్రి వెంకట్ రెడ్డి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని నిర్వాసితురాలు కవిత చెప్పారు. తనకు ఎస్ ఎల్ బి సి వద్ద 201 గజాల ప్లాటు ఉందని దానిని కట్నం కింద 30 లక్షలకు తన అల్లునికి ఇచ్చానని చెప్పారు. ప్రస్తుతం రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల తన ప్లాటు మొత్తం పోతుందని దీంతో అల్లుడు తన బిడ్డను పుట్టింటికి పంపించాడని రోదిస్తూ చెప్పారు. ఇప్పుడు తాను తన బిడ్డ ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నామని మంత్రి వెంకట్ రెడ్డి తమకు న్యాయం చేసి ఆదుకోవాలని ఆమె కోరారు.
మంత్రికి తప్పుడు సమాచారం అందిస్తున్నారు..
(విజయలక్ష్మి భూనిర్వాసితురాలు )
రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల జరుగుతున్న నష్టం పై కొంతమంది మంత్రి వెంకటరెడ్డికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని భూనిర్వాసితురాలు విజయలక్ష్మి ఆరోపించారు. అలైన్మెంట్ 3 ప్రకారం రోడ్డు నిర్మాణం చేపడితే 2800 ప్లాట్లు, 200 ఇండ్లు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. అయితే మంత్రి మాత్రం కేవలం 60 మందికి మాత్రమే నష్టం కలుగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు సమయం ఇస్తే మూడు వేల మంది నిర్వాసితులతో కలుస్తామని విజయలక్ష్మి చెప్పారు. తనకు మెడికల్ కళాశాల ఎదుట 400 గజాల ప్లాటు ఉందని ప్రస్తుతం ఇక్కడ గజం ధర 20,000 ఉందని తెలిపారు. ప్రభుత్వం మాత్రం నష్టపరిహారం కింద గజానికి నాలుగైదు వేలు ఇస్తే ఎలాగంటు ఆమె ప్రశ్నించారు. అప్పులు చేసి ప్లాటును కొనుగోలు చేశానని ఇప్పుడు ఫ్లాట్ పోతే అప్పు కూడా తీర్చలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రింగ్ రోడ్డు నిర్మాణం పై పునరాలోచన చేయకపోతే ఆత్మ హత్య నే శరణ్యమని రోధిస్తూ చెప్పారు.
Spread the love