కోఠి ఈఎన్‌టీలో అరుదైన ఆపరేషన్‌

Kothi is a rare operation in ENT– మూగబోయిన గొంతులో నుంచి
– మాటలు పలికించిన ఈఎన్‌టీ వైద్యులు
– అభినందించిన మంత్రి దామోదర, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌
నవతెలంగాణ-సుల్తాన్‌ బజార్‌
హైదరాబాద్‌ కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్‌ నిర్వహించారు. మూగబోయిన ఓ యువకుడి గొంతులో నుంచి మాటలు పలికించారు. వివరాల్లోకెళ్తే.. కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన 29 ఏండ్ల రాము 2011లో తన వ్యక్తిగత సమస్యల దృష్ట్యా పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అతనికి మత్తు వైద్యులు త్వరగా కోలుకోవడానికి శ్వాసనాళంలో గొట్టం వేసి, వెంటిలేటర్‌ అమర్చి, నాలుగు నుంచి ఆరు వారాలపాటు చికిత్స అందించారు. తరువాత రోగి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యాడు. కానీ రెండు మూడు నెలల తర్వాత పేషెంట్‌కు శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తింది. వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చూపించుకోగా వైద్యులు అతనికి తగిన పరీక్షలు నిర్వహించి, వెంటనే ఎమర్జెన్సీ ట్రేకియాష్టమీ (శ్వాసనాళంలో రంధ్రం చేయడం ద్వారా ఆక్సిజన్‌ ను అందించడం) చేసి రోగి ప్రాణాలను కాపాడారు. తర్వాత అతను కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి రోగికి గొంతులో ట్రేకియాస్టమి ట్యూబ్‌ ఉండడంవల్ల గాలి తీసుకోగలుగుతున్నా.. మాట రావడం లేదు. 10 ఏండ్ల తర్వాత పేషెంట్‌కు ఎలాగైనా మాట్లాడాలనే ఉద్దేశం కలిగి కోఠి ప్రభుత్వ ఈఎన్‌టీ హాస్పిటల్‌కు వచ్చాడు. వైద్యులు పరీక్షించి, వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అధునాతన ”డ్యూమాన్‌” స్టంట్‌ను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా తెప్పించారు. దాన్ని యువకుడి శ్వాసనాళంలో అమర్చి, చెవిలోని మృదులాస్తిని గొంతు దగ్గర చేసిన రంధ్రంలో ఉంచారు. దాని ద్వారా ఆ రంధ్రాన్ని మూసివేసి పేషెంట్‌కు శ్వాస తీసుకోవడంలో కష్టం లేకుండా సాధారణ స్థితిలో మాట్లాడేలాగా విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ మేరకు వైద్యబృందాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి. శంకర్‌ అభినందించారు. ఈ ఆపరేషన్‌లో ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆనంద్‌ ఆచార్య, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంపత్‌ రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ ఫణి భూషణ్‌, డాక్టర్‌ స్వామి, మత్తు విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉమా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ ఉమా ప్రదీప, డాక్టర్‌ నిఖిల, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, థియేటర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love