నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చేయని పని చేసినట్టుగా చెప్పుకోవడం కాంగ్రెస్ అలవాటేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయనప్పటికీ తానే చేసినట్టుగా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. నర్సుల నియామకాలకు సంబంధించి శుక్రవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో 6,956 స్టాఫ్ నర్సులు, 15,750 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి గత కేసీఆర్ ప్రభుత్వం నియామక ప్రక్రియను పూర్తి చేసిందనీ, అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలను విడుదల చేయలేకపోయామని గుర్తుచేశారు. ఇలాంటి వాస్తవాలను విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా అబద్ధాలాడుతున్నారని ఎద్దేవా చేశారు.