– ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందన్న జి-7 దేశాల నేతలు
బోర్గో ఎగజియా రిసార్ట్ : గర్భస్రావ హక్కులపై జి-7 దేశాల నేతలు స్పష్టమైన నిబద్ధత ప్రకటించకుండానే తుది ముసాయిదా ప్రకటన సిద్దమైంది. ‘సురక్షితమైన, చట్టబద్ధమైన గర్బస్రావానికి అవకాశం’ ఇవ్వాలంటూ గతేడాది జపాన్ సదస్సులో జి-7 దేశాల నేతలు నిబద్ధత ప్రకటించారు. ఆ ప్రస్తావన ఈ ఏడాది ముసాయిదా ప్రకటనలో కనిపించలేదు. ”సమగ్ర లైంగిక, పునరుత్పాతక ఆరోగ్య హక్కులతో సహా మహిళలకు సార్వజనీనంగా తగిన రీతిలో, సమర్ధవంతమైన, నాణ్యత గల ఆరోగ్య సేవలు అందించడానికి హిరోషిమా నేతల ప్రకటనలో పేర్కొన్న నిబద్ధతలను మేం పునరుద్ఘాటిస్తున్నాం.” అని ముసాయిదా పేర్కొంది. మహిళల హక్కులపై ఉపయోగించిన భాషను నీరుగార్చడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రయత్నిస్తున్నారన్న వార్తలను అమెరికా, ఫ్రాన్స్ రెండు దేశాలు తిరస్కరించాయి. గర్భస్రావంపై ఇటలీ వైఖరి పట్ల ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఈ హక్కును పొందుపరుస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్ ఈ ఏడాది తొలినాళ్లలో ఓటు వేసింది. ఈ అంశంపై ప్రచారం కోసం జి-7 సదస్సును ఒక వేదికగా ఉపయోగించుకోవడం తప్పని మాక్రాన్‌ను మెలోనీ విమర్శించారు. అబార్షన్ పదాన్ని వుంచడం లేదా తొలగించడం అన్న అంశంపై వివాదం పూర్తిగా ఆశ్చర్యకరమైనదని మెలోనీ వ్యాఖ్యానించారు. సురక్షితమైన, చట్టబద్ధమైన గర్భస్రావానికి హామీ కల్పించాల్సిన అవసరాన్ని గతేడాదే మేం ఆమోదించామని ఆమె చెప్పారు. అబార్షన్‌పై స్పష్టమైన పదజాలం ఉపయోగించుకోవడంలో జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇయు సీనియర్ అధికారి ధృవీకరించారు. హిరోషిమా సదస్సులో అంగీకారం కుదిరిన దాన్ని సమర్ధిస్తున్నామని, వివాదాల పరిష్కారాలపై ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సాధ్యం కాలేదని అన్నారు. స్వేచ్ఛ కోసం ఉక్రెయిన్ జరిపే పోరాటానికి మద్దతునిచ్చే విషయంలో తాము సంఘీభావంగా వున్నామని ముసాయిదా పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధంపై గురువారం జరిగిన జి7 నేతల ప్రత్యేక సమావేశానికి జెలెన్‌స్కీని ఆహ్వానించారు.