భారత్‌ జయించిందిలా!

let-india-win– కెప్టెన్‌ రోహిత్‌, కోచ్‌ ద్రవిడ్‌ దూకుడు మంత్ర
– ఫలించిన నలుగురు ఆల్‌రౌండర్ల కూర్పు
– జట్టులోని ప్రతి ఆటగాడిపై ఎనలేని నమ్మకం
– టీమ్‌ ఇండియా భావోద్వేగ విజయ ప్రస్థానం
హార్దిక్‌ పాండ్య.. ఐపీఎల్‌లో దేశవ్యాప్తంగా విద్వేషం చవిచూశాడు. అతడు ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌
జశ్‌ప్రీత్‌ బుమ్రా.. వెన్నునొప్పి గాయంతో ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్నాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఆడలేకపోయాడు. ఇప్పుడు 2024 టీ20 ప్రపంచకప్‌ను సాధించాడు.
రిషబ్‌ పంత్‌.. 2022 రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. సుమారు రెండేండ్లు ఆటకు దూరమయ్యాడు. పంత్‌ ఇప్పుడు పొట్టి ప్రపంచకప్‌ విజేత.
2022 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌, 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌, 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ గుండెకోత ఎదుర్కొన్న సందర్భాలు. భారత జట్టు సారథిగా నాల్గో ప్రయత్నంలో రోహిత్‌ శర్మ దేశం గర్వపడే విజయాన్ని అందించాడు. దిగ్గజ ఎం.ఎస్‌ ధోని సరసన నిలిచాడు.
రాహుల్‌ ద్రవిడ్‌.. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో మరిచిపోలేని పరాజయం చవిచూశాడు. ఇప్పుడు అదే గడ్డపై 2024 టీ20 ప్రపంచకప్‌ను కోచ్‌గా అందుకుని ఔరా అనిపించాడు. దశాబ్ది కాలంగా కంటి దిగువన దాగి ఉన్న కన్నీళ్లు ఒక్క విజయంతో ఉబికి వచ్చాయి. క్రికెటర్లు, సహాయక సిబ్బందితో పాటు మాజీ క్రికెటర్లు, అభిమానులు సైతం భావోద్వేగ సంద్రంలో మునిగిపోయారు. 2024 టీ20 ప్రపంచకప్‌ విజయం అందుకే ప్రత్యేకం.
పొట్టి ప్రపంచకప్‌ విజేతలకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సాధించిన రోహిత్‌సేనకు రూ.125 కోట్ల నగదు బహుమతి అందిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. అద్వితీయ విజయం సాధించిన క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి బీసీసీఐ అభినందనలు తెలిపింది.
నవతెలంగాణ క్రీడావిభాగం
ప్రపంచ క్రికెట్‌ అగ్రజట్టు. అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు. స్వదేశంలో వంద కోట్ల విశేష అభిమాన ఆదరణ. అయినా, పదేండ్లుగా ఐసీసీ టైటిల్‌ విజయం లేదనే వెలితి. టీమ్‌ ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌ పులి అంటూ.. పాశ్చాత్య మీడియా, క్రికెట్‌ విశ్లేషకులు హేళన చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. పదేండ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్‌సేన టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను స్వదేశానికి పట్టుకొచ్చింది. పొట్టి ప్రపంచకప్‌ ట్రోఫీని భారత్‌ అందుకునేందుకు.. తెరవెనుక, తెర ముందు అవిశ్రాంత పోరాటం చేసిన హీరోల గురించి…!
నాయకుడు రోహిత్‌
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్‌ ఒకడు. ముంబయి ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్‌ అందించిన రోహిత్‌.. భారత్‌కు ఐసీసీ టైటిల్‌ లోటు తీర్చగలడని అప్పటి బీసీసీఐ బాస్‌ గంగూలీ గట్టిగా విశ్వసించాడు. రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు దక్కటంలో దాదా పాత్ర ఎక్కువ. 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్లో పోటీ ఇవ్వకుండా ఓటమి పాలైంది. అక్కడే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ నిర్ణయానికి వచ్చాడు. సంప్రదాయ క్రికెట్‌తో ఐసీసీ టైటిల్‌ సాధించలేమని.. బ్రేకుల్లేని దూకుడు మంత్ర అవసరమని భావించాడు. జట్టుకు దూకుడు మంత్ర ఎక్కించాడు. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో ముందుండి ఎదురుదాడి చేశాడు. అజేయంగా ఫైనల్‌కు చేర్చినా.. ఆఖర్లో నిరాశే ఎదురైంది. అదే పంథా కొనసాగించి కరీబియన్‌ దీవుల్లో కప్పు కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో టైటిల్‌ పోరులో రోహిత్‌, పంత్‌, సూర్య పవర్‌ప్లేలో నిష్క్రమించినా.. క్రీజులోకి వస్తూనే అక్షర్‌ పటేల్‌ బౌండరీ బాదటం వెనుక రహస్యం ఇదే ఫార్ములా. వికెట్లు పడినా.. ఎదురుదాడి ట్రాక్‌ వీడొద్దనే ఫార్ములా భారత్‌ను నేడు చాంపియన్‌గా నిలిపింది.
ది వాల్‌.. గురువు
భారత క్రికెట్‌ జెంటిల్‌మెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌. స్వతహాగా సంప్రదాయ క్రికెటర్‌. కానీ కోచ్‌గా తన టీమ్‌ను పూర్తి భిన్న పథంలో నడిపించాడు. ఆటగాడిగా దక్కని ఐసీసీ టైటిల్‌ను.. కోచ్‌గా చివరి రోజు సాధించాడు. గతంలో తుది జట్టు కూర్పులో ప్రతి మ్యాచ్‌కు మార్పులు చేర్పులు సహజం. కానీ ఈ ప్రపంచకప్‌లో భారత్‌ 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దింపింది. ప్రదర్శనతో సంబంధం లేకుండా ఆటగాళ్లపై విశ్వాసం ఉంచిన ద్రవిడ్‌.. గొప్ప ఫలితం సాధించాడు. తుది జట్టు కూర్పులో నలుగురు ఆల్‌రౌండర్లను ఎంచుకోవటం భారత్‌కు బాగా కలిసొచ్చింది. రవిశాస్త్రి, అనిల్‌ కుంబ్లేలు ఐసీసీ టైటిల్‌కు చేరువగా వచ్చినా.. రాహుల్‌ ద్రవిడ్‌ ఒక్కడే గత దశాబ్ది కాలంలో చాంపియన్‌గా నిలిచిన భారత చీఫ్‌ కోచ్‌.
విరాట పర్వం
టీ20 ప్రపంచకప్‌ జట్టులో విరాట్‌ కోహ్లి చోటుపై ప్రశ్నలు. గ్రూప్‌, సూపర్‌8 మ్యాచుల్లో వైఫల్యంతో విమర్శలు. అయినా, జట్టు మేనేజ్‌మెంట్‌ కోహ్లిపై నమ్మకం ఉంచింది. కెరీర్‌ చివరి టీ20 మ్యాచ్‌లో కోహ్లి క్లాస్‌ చూపించాడు. బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌పై సహచర బ్యాటర్లు నిరాశపరిచినా.. ఓ ఎండ్‌లో గట్టిగా నిలబడ్డాడు. 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ తరహాలో 2024 టైటిల్‌ పోరులో అర్థ సెంచరీతో ఆదుకున్నాడు. అన్ని మ్యాచుల్లో పరుగుల వేట ఓ ఎత్తు.. టైటిల్‌ పోరు ఒక్కటీ ఓ ఎత్తు అని మరోసారి నిరూపించాడు. ఫైనల్లో విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.
రథ సారథి బుమ్రా
బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించని పిచ్‌లపై టీమ్‌ ఇండియాను విజయ తీరాలకు చేర్చిన రథ సారథి, పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా. గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన బుమ్రా.. స్వల్ప స్కోరును నిలబెట్టాడు. ఫైనల్లోనూ చేజారింది అనుకున్న మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చరిత్ర పుటల్లో నిలిచిపోయే బుల్లెట్ల వంటి బంతులను సంధించాడు. భారత్‌ కష్ట కాలంలో ప్రతి సారి బంతి అందుకుని వికెట్ల వేట సాగించాడు. యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 8 మ్యాచుల్లో 17 వికెట్లు కూల్చగా.. బుమ్రా 8 మ్యాచుల్లో 15 వికెట్లు కూలదోశాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ సగటు 12.64 కాగా.. బుమ్రా సగటు 8.26 కావటం విశేషం. ముంబయి ఇండియన్స్‌కు ఐపీఎల్‌ నరాలు తెగే ఉత్కంఠ ఫైనల్లో అద్వితీయ విజయాలు అందించిన బుమ్రా.. ఈసారి ఆ పని భారత్‌కు చేసి పెట్టాడు. బుమ్రా లేకుండా భారత టీ20 ప్రపంచకప్‌ విజయాన్ని ఊహించలేం.

Spread the love