తెలంగాణ బలం, గళం వినిపించండి

Let Telangana's strength and voice be heard– ఎంపీలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం
– ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం
నవతెలంగాణ-గజ్వేల్‌
త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బలం, గళం వినిపించాలని ఎంపీలకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కుకు మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో సమావేశం నిర్వహించారు. త్వరలోనే పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించిన అంశాలపై చర్చించారు.
పార్లమెంట్‌ సమావేశంలో ప్రెసిడెన్షియల్‌ అడ్రస్‌, ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ రెండు అంశాలపై ఎంపీలు, రాజ్యసభ సభ్యులు తమ వాణిని వినిపించాలని సమావేశంలో చర్చించినట్టు సమాచారం. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించేది భారత రాష్ట్ర సమితి ఎంపీలేనని కేసీఆర్‌ అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలు, కృష్ణా బేసిన్‌లో పెండింగ్‌ అంశాలపై పార్లమెంటులో లేవనెత్తాలని ఎంపీలకు సూచించారు. పెండింగ్‌ అంశాలతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చర్చకు తీసుకురావాలన్నారు. పార్లమెంటు సమావేశాల్లో విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలపై చర్చకు తీసుకురావాలని ఎంపీలను ఆదేశించారు. బీసీ జన గణన, ఎస్సీ వర్గీకరణ, ప్రజల పక్షాన నుంచి ప్రజల కోసం మాట్లాడాలని కేసీఆర్‌ ఎంపీలకు సూచించారు. తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలని చర్చకు తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు కేశవరావు, ఎంపీ రంజిత్‌ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అనేక విషయాలు చర్చించామని, కేసీఆర్‌ అనేక విషయాలను చర్చించినట్టు వారు తెలిపారు. ప్రజల పక్షాన ఉండి పోరాటం సాగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, కవిత, దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అన్ని అంశాలను లేవనెత్తుతాం – నామా నాగేశ్వర్‌
తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. కేంద్రం నుంచి తెలంగాణాకు రావాల్సిన వాటాలు, కృష్ణా బేసిన్‌లో జరుగుతున్న పెండింగ్‌ అంశాలు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న అన్ని విషయాలనూ లేవనెత్తుతాం.
తెలంగాణ గళం వినిపిస్తాం – రంజిత్‌ రెడ్డి, దయాకర్‌
పార్లమెంట్‌ పార్టీ మీటింగ్‌లో రాబోయే ప్రెసిడెన్సియల్‌ అడ్రస్‌, ఓట్‌ ఆన్‌ ఎకౌంటు అంశాలపై చర్చించాం. పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించేది బీఆర్‌ఎస్‌ ఎంపీలే. తెలంగాణ సత్ఫలితాలపై దిశా నిర్దేశం చేయడం జరిగింది. విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలపై చర్చించాలి. బీసీ జనగణన, ఎస్సీ వర్గీకరణ, ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మాట్లాడాలని కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు.

Spread the love