Monday, August 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుక్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం

- Advertisement -

​రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం
నేటి జైల్ భరోను జయప్రదం చేయండి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
సంగారెడ్డిలో యంగ్‌ వర్కర్స్ స్టీరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో 2కే రన్

నవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
‘‘క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ వ్యవస్థను రక్షించుకుందాం. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల… రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైల్‌ ‌భరో కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. జైల్‌ ‌భరోలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీయూ యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం జయప్రదానికై 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరముందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో
సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు.

నాడు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు పోరాడాలని అన్నారు. అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలంతోనే రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు కోడ్‌‌లు గా తీసుకురావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించడమేనని తెలిపారు. దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సంఘటిత పోరాటాల ద్వారా తగిన గుణపాఠం నేర్పాలన్నారు. మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి బీజేపీ పాలనకు చరమగీతం పాడితే తప్ప ఈ విధానాలను తిప్పి కొట్టలేమన్నారు. నేడు జరగనున్న జైల్‌ భరో కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున ‌పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, సాయిలు, సహాయ కార్యదర్శి ఎం.యాదగిరి, ఉపాధ్యక్షులు బాగారెడ్డి, మద్దూరు శివ, స్టీరింగ్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -