సామాజిక వివక్ష, దోపిడీని నిర్మూలిద్దాం

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– సుందరయ్య జీవితం ఎందరికో ఆదర్శం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌, నాగయ్య
– సుందరయ్య ప్రజల మనిషి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు,సుదర్శన్‌ రావు
– పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా పలు జిల్లాల్లో సదస్సులు
– సహపంక్తి భోజనాలు, హన్మకొండలో పార్టీలో చేరిన 200 కుటుంబాలు
నవతెలంగాణ- సుజాతనగర్‌/కొత్తగూడెం/మియాపూర్‌/విలేకరులు
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీని నిర్మూలిద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నివాళులర్పించారు. అనంతరం సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో చింతలపూడి సత్యం భవన్‌లో చప్పిడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు. పుచ్చలపల్లి సుందరయ్య తన చిన్న వయసులోనే తన ఆస్తి మొత్తాన్ని పేదలకు పంచి దళితులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షపై పోరాడారని గుర్తుచేశారు. రైతాంగ సాయుధ పోరాట సారధిగా నిజాం నవాబును తరిమికొట్టి 10 లక్షల ఎకరాల భూ పంపిణీ చేసిన మహా నాయకుడు సుందరయ్య అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో మనమందరం ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, ఖమ్మం జిల్లా పార్టీ కమిటీ సభ్యులు బండారు రమేష్‌, మండల కార్యదర్శి వీర్ల రమేష్‌, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని స్థానిక మంచికంటి భవన్‌లో కొత్తగూడెం పట్టణ కమిటీ కార్యదర్శి లిక్కి బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన సభకు సీపీఐ(ఎ) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా చేసే పోరాటమే సుందరయ్యకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. స్వాతంత్య్రం అంటే కేవలం పాలకులను బయటకు పంపడమే కాదని, అంతర్గతంగా ఆర్ధిక అసమానతలు, ఆర్ధిక దోపిడి, వర్గ దోపిడీ ఉండకూడదని సుందరయ్య భావించారని, మన స్వాతంత్య్రాన్ని మేడిపండుగా అభివర్ణించారని తెలిపారు. ప్రజా జీవనంలో ఉండే వాళ్లు విచ్చలవిడిగా ఉంటే జనం నమ్మరని తెగేసి చెప్పేవారని అన్నారు. అసెంబ్లీకి కూడా ఆయన సైకిల్‌ పైనే వెళ్ళేవారని గుర్తు చేశారు. సుందరయ్య జీవితం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.
హైదరాబాద్‌ గుచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజ్ఞాన కేంద్రం కార్యదర్శి, నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి. సాగర్‌ హాజరయ్యారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సాగర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమర యోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చపల్లి సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శం అని అన్నారు. చిన్నతనంలోనే దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారధ్యం వహించి.. దొరలు, భూస్వాములను తరిమికొట్టి, మట్టి మనుషులను మహౌన్నతులుగా తీర్చిదిద్దిన పోరాట యోధుడని కొనియాడారు. చిన్న వయసులోనే తన ఇంట్లోనే ప్రశ్నించడం ప్రారంభించారని, పనులు చేసేవారికి వేరు, ఇంట్లో వారికి వేరుగా భోజనం పెడితే వ్యతిరేకించేవారని తెలిపారు. దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. వ్యవసాయ కూలీలకు మొట్ట మొదటి సారిగా కూలీ సంఘం పెట్టి వారి పక్షాన పోరాడారని తెలిపారు. ఆయన మరణించి 39 ఏండ్లు గడిచినా నేటికీ సుందరయ్యను గుర్తు పెట్టుకొనే వారు చాలా మంది ఉన్నారన్నారు. ఆయన ఎంతో నిబద్దత కల్గిన వ్యక్తి అని కొనియాడారు. హంగూ ఆర్భాటాలు లేకుండా మాతాంతర వివాహం చేసుకున్నారని తెలిపారు. పిల్లలను సైతం వద్దనుకొని.. తన జీవితాన్ని పార్టీకే అంకితం చేశారని తెలిపారు. సుందరయ్య ఆశలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు ఆర్‌.సాంబశివ రావు, శ్రీనివాస్‌, శేరిలింగంపల్లి ఏరియా కన్వీనర్‌ శోభన్‌, కృష్ణ, రవీందర్‌, అనిల్‌, సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్‌ పరిశ్రమలోని శాండ్విక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జరిగిన సుందరయ్య వర్ధంతిలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్‌ యూనియన్‌ అధ్యక్షులు చుక్క రాములు పాల్గొన్నారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుందరయ్య అజాత శత్రువని, నిరాడంబరుడని, ప్రజల మనిషి అని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు దిక్సూచి సుందరయ్య అని, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వర్ధంతి సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి మాట్లాడారు. పీడిత ప్రజల ప్రియతమ నేత, స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు పుచ్చలపల్లి సుందర య్య జీవితం ఆదర్శనీయమని కొనియాడారు .
సుందరయ్య వర్థంతి సందర్భంగా సహపంక్తి భోజనాలు
కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతిని పురస్కరించుకుని సీపీఐ(ఎం) సంగారెడ్డి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సహపంక్తి భోజనాలు చేశారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ఏరియా కార్యదర్శి ఎం.యాదగిరి మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలో అతిచిన్న వయసులోనే జైలు జీవితం అనుభవించిన గొప్ప వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా చిన్నతనంలోనే కుటుంబం, సమాజంతోనూ పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి సామాన్యులను వీరులుగా చేశారన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రభుత్వాలకు మార్గ నిర్దేశం చేశారని, అందుకు అధికారంలో ఉన్న వారు సైతం ఆయన్ను గౌరవించేవారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో సహపంక్తి భోజనాలు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ నాయకులు మణి, పద్మమ్మ, సురేందర్‌, మహేశ్వరి, రామా, లక్ష్మణ్‌, యాదగిరి, దత్తు, వీరేశం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి సీపీఐ(ఎం)లో భారీ చేరికలు
– సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిద్దాం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
నవతెలంగాణ-ఎన్జీవోస్‌ కాలనీ
బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సీపీఐ(ఎం)లోకి భారీగా చేరికలు జరిగాయి. హన్మకొండ పట్టణం రాంనగర్‌లోని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి అధ్యక్షతన నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా న్యూ శాయంపేటలోని జ్యోతిబసు నగర్‌, పెద్దమ్మ గడ్డలోని జ్యోతిబస్‌నగర్‌ కాలనీకి చెందిన 200కుటుంబాలు పార్టీలో చేరాయి.
కారు ఉపేందర్‌, బోట్ల కుమారస్వామి, రామంచ సారంగపాణితో పాటు పార్టీలో చేరిన 200కుటుంబాల సభ్యులకు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన సుందరయ్య జీవితం మొత్తం పేదలు, కష్టజీవుల కోసమే త్యాగం చేశారని గుర్తుచేశారు. సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేపట్టి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదల సమస్యలు పరిష్కరించేందుకు సీపీఐ(ఎం) పోరాటాలు నిర్వహిస్తుందని, ఏ పార్టీ కూడా పేదలకు ఇంటి స్థలం ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి, ఎం చుక్కయ్య, టి ఉప్పలయ్య, జిల్లా కమిటీ సభ్యులు గొడుగు వెంకట్‌, జి రాములు, మంద సంపత్‌, దీప తదితరులు పాల్గొన్నారు.

Spread the love