హక్కులకై ఐక్యంగా పోరాడుదాం

Let's fight for rights together– ఆదివాసి అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ నాలుగో మహాసభలో వక్తల పిలుపు
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని నమ్మకల్‌ జిల్లా కేంద్రంలో ఆదివాసి అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ నాలుగో మహాసభలు రెండో రోజు జయ ప్రదంగా జరిగింది. మహాసభకు అధ్యక్ష వర్గంగా మిడియం బాబురావు(తెలంగాణ), దులి చంద్‌ (రాజస్థాన్‌), నరేష్‌ జమాతియా(త్రిపుర), క్రిపా ఎక్కా(జార్ఖండ్‌), పి.షణ్ముఖం (తమిళనాడు), విజయ ధరన్‌ ఖనీ (కేరళా) వ్యవరించారు.కార్యదర్శి నివేదిక పై 15 రాష్ట్రాల నుంచి 38 మంది రాష్ట్రాల్లో జరిగిన గిరిజన ఉద్యమాలు పోరాటాలు సంఘ నిర్మాణం వంటి అంశాలపై బుధవారం చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి భూక్యా వీరభద్రం, గుగులోత్‌ భీమా సాహెబ్‌, కొర్ర శంకర్‌, పూసం సచిన్‌, లంకా రాఘవులు ప్రతినిధుల తరఫున మాట్లాడారు. మహాసభలో ఆదివాసీ హక్కుల ఉల్లనతోపాటు ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలపై దాడి, గిరిజన విద్యను కాషాయీకరణ చేయడానికి వ్యతిరేకంగా, మణిపూర్‌ మారణహోమానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తీర్మానాలను ఆమోదించారు.
అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెదుతున్న బీజేపీ ప్రభుత్వం : బి వెంకట్‌
మహాసభకు సౌహార్థ సందేశం ఇవ్వడానికి వచ్చిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తూ గిరిజన ప్రాంతాల్లోని విలువైన ఖనిజ, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాదిమంది గిరిజనులను భూ నిర్వాసితులుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు లక్షలాది ఎకరాలుగా ఉన్న వాటిని గిరిజనులు పేదలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వ భూములను పేదలు, గిరిజనులు ఆక్రమించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా పిలుపునిస్తున్నదని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజనులు ఉపాధి పొందుతున్న ఉపాధి హామీని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నదని అన్నారు. బడ్జెట్లో భారీగా నిధులు తగ్గించి కొట్లాదిమంది పేదల ఉపాధి పనులకు దూరం చేసిందని ఆరోపించారు. స్వాతంత్ర వచ్చినప్పటి నుండి గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కోట్లాదిమంది పేదలకు ఉపయోగ పడుతున్న ఆహార భద్రతా పథకానికి కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులను కోత విధించడం విచారకరమని అన్నారు. ప్రజలను విభజించే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా గిరిజనులు, పేదలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Spread the love