ఈ అంశంపై ఒక్కటిగా కొట్లాడదాం

ఈ అంశంపై ఒక్కటిగా కొట్లాడదాం– కేఆర్‌ఎమ్‌బీ పరిధిలోకి ఆ ప్రాజెక్టులు వెళితే రాష్ట్రానికి తీరని నష్టం
– ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ, ఆంధ్రా మధ్యనున్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళతాయనే వార్తలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా వాటన్నింటినీ కేఆర్‌ఎమ్‌బీ పరిధిలోకి తెచ్చేందుకు ఢిల్లీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిందని ఆయన తెలిపారు. ఇదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటిగా కొట్లాడదామంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారబోతున్న అంశాలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరారు. కేఆర్‌ఎమ్‌బీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలన్న కేంద్ర ప్రతిపాదనను 2021లోనే మాజీ సీఎం కేసీఆర్‌ వ్యతిరేకించారని గుర్తు చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున తాము కొన్ని షరతులను విధించామనీ, ఇప్పటికీ కేంద్రం వాటిని ఒప్పుకోలేదని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎమ్‌బీ పరిధిలోకి ఎలా తెస్తారు..? ఆపరేషన్‌ మాన్యువల్‌ను రూపొందించకుండా ఈ అంశంపై ఎలా ముందుకెళతారని ప్రశ్నించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కేఆర్‌ఎమ్‌బీ పరిధిలోకి ప్రాజెక్టులను తేవటాన్ని గుడ్డిగా ఒప్పుకున్నదనే వార్తలొస్తున్నాయని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదాపై కూడా రేవంత్‌ సర్కార్‌ ఇదే రకంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. కేఆర్‌ఎమ్‌బీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తెస్తే జల విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. దాదాపు ఐదు వేల మిలియన్‌ యూనిట్ల జల విద్యుత్‌ను మనం కోల్పోవాల్సి వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కేఆర్‌ఎమ్‌బీకి దరఖాస్తు పెట్టి, వాళ్లు అనుమతించే లోపు గ్రిడ్‌ కుప్పకూలుతుందని హెచ్చరించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వపై కేఆర్‌ఎమ్‌బీ ప్రభావం పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు ఇబ్బందులేర్పడతాయని వివరించారు. ఇలా ఏ రకంగా చూసినా కేఆర్‌ఎమ్‌బీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావటమనేది తెలంగాణకు ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనీ, వాటి కోసం ఎంతకైనా తెగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Spread the love