వాయిదాలపై పరిశీలిస్తా

Let's look at the installments–  అదానీ-హిండెన్‌బర్గ్‌ కేసుపై సీజేఐ
న్యూఢిల్లీ : అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో దాఖలైన పలు పిటిషన్లు ఇంకా సుప్రీంకోర్టులో విచారణకు రావడం లేదు. ఈ కేసులో ఆగస్ట్‌ 26న విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడింది. రెండు నెలలు దాటినప్పటికీ పిటిషన్లు నేటి వరకూ విచారణకు నోచుకోలేదు. ఓ పిటిషనర్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ దీనిపై అసహనం వ్యక్తం చేశారు. విచారణ తేదీని నిర్ణయించడంలో జాప్యం జరుగుతోందని ఆయన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ దృష్టికి తెచ్చారు. ‘ఈ కేసు ఆగస్టు 28న విచారణకు రావాల్సి ఉంది. అయితే వాయిదా పడింది. వాయిదా…వాయిదా…వాయిదా’ అని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా రిజిస్ట్రీకి సూచిస్తానని తెలిపారు. అదానీ గ్రూప్‌ ఆర్థిక తప్పిదాలకు పాల్పడిందని, ఖాతాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ జనవరి 24న ఓ నివేదికను ప్రచురించింది. అయితే ఈ ఆరోపణల్ని అదానీ గ్రూపు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో సెబీ వైఫల్యాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని నియమించింది. మరోవైపు సెబీ కూడా సొంతగా దర్యాప్తు చేపట్టింది. నిపుణుల కమిటీకి సెబీ తన నివేదికను ఆగస్ట్‌ 14న సమర్పించాల్సి ఉన్నప్పటికీ విచారణ పూర్తి చేసేందుకు మరికొంత సమయం తీసుకుంది. చివరికి ఆగస్ట్‌ 25న సెబీ తన స్టేటస్‌ నివేదికను అందజేసింది. కానీ సెబీ నివేదికపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మొత్తం 24 దర్యాప్తులు చేపట్టానని, వాటిలో 22 పూర్తయ్యాయని సెబీ తెలిపింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. సెబీ వైఫల్యాన్ని ఎత్తిచూపడం కష్టమని నిపుణుల కమిటీ తెలిపింది.

Spread the love