సర్కారు బడుల బలోపేతానికి కృషి చేద్దాం

సర్కారు బడుల బలోపేతానికి కృషి చేద్దాం– బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి :ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడం కోసం గురువారం నుంచి ఈనెల 19 వరకు జరిగే ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యమ్రాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని దోమల్‌గూడ యూటీఎఫ్‌ భవన్‌లో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల నమోదుతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ద్వారా సర్కారు బడుల్లో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుకు ఊతమిచ్చిన వారమవుతామని అన్నారు. అందుకోసం పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తప్పనిసరిగా సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు.
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను సజావుగా పూర్తి చేయాలి : జంగయ్య
ఈ సమావేశానికి అధ్యక్ష వహించిన టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతుల్లేక తొమ్మిదేండ్లుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఆరేండ్లుగా బదిలీలు చేపట్టకపోవడంతో విద్యారంగానికి తీవ్ర నష్టం కలిగిందన్నారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రకటించి సజావుగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌ ప్రభత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు డీఏల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. 2022 జులై నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు విడతల డీఏను వెంటనే ప్రకటించాలని కోరారు.
పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలి : చావ రవి
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ-కుబేర్‌ పేరుతో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, సరెండర్‌ లీవు, జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ రుణాలు, ఫైనల్‌ పేమెంట్లన్నింటినీ ఏండ్ల తరబడి సుదీర్ఘకాలం పెండిరగ్‌లో ఉంచిందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర వేదనకు గురిచేసిందనీ, పెండిరగ్‌ బిల్లులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మోడల్‌ స్కూల్‌ బదిలీలపై ఉన్న స్టే ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కేజీబీవీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించి, ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టాలని సూచించారు. సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, మైనార్టీ, బీసీ గురుకులాల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీసీ, జనరల్‌ గురుకులాల బోధనా సమయాన్ని ఇతర గురుకులాలతో సమానంగా మార్చాలని చెప్పారు. అప్‌గ్రేడ్‌ చేసిన 10,479 పండిట్‌, పీఈటీల అప్‌గ్రెడేషన్‌ పోస్టులను పాఠశాలలకు కేటాయించి పండితులు, పీఈటీలకు పదోన్నతులివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌ రాములు, సిహెచ్‌ దుర్గా భవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, పత్రిక సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ నిధి, రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె సోమశేఖర్‌, ఎం వెంకటి, వి శాంతికుమారి, ఎస్‌ మల్లారెడ్డి, డి సత్యానంద్‌, జి నాగమణి, కె రవికుమార్‌, ఎస్‌ రవిప్రసాద్‌గౌడ్‌, వై జ్ఞానమంజరి, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love