Thursday, July 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపంటలకు ప్రాణం

పంటలకు ప్రాణం

- Advertisement -

వర్షాలతో రైతులకు ఊరట పలుచోట్ల ఉప్పొంగుతున్న వాగులు
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద.. దిగువకు విడుదల
సింగూర్‌కు స్వల్ప వరద ప్రవాహం
పొంగిపొర్లుతున్న ఘనపూర్‌ రిజర్వాయర్‌
పెద్దపల్లి జిల్లాలో అధిక వర్షపాతం
సింగరేణి బావుల్లో ఉత్పత్తికి ఆటంకం

నవతెలంగాణ- విలేకరులు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు రాష్ట్రంలో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ నుంచి మోస్తరు వర్షాలు ఊరటనిస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షం పడటంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పంటలకు ప్రాణం పోసినట్టు కావడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఎగువ రాష్ట్రాల నుంచి కూడా వరద వస్తుండటంతో ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. ఆ మేరకు అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో సాధారణం కంటే ఏకంగా అధిక వర్షపాతం నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. సింగరేణి ఏరియాలోని బొగ్గు బావుల్లో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరికొన్ని చోట్ల రహదారులు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో లోతట్టు, ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మెదక్‌ జిల్లాలోని ఘనపురం రిజర్వాయర్‌ పొంగిపొర్లుతున్నది. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 4.215 టీఎంసీలు కాగా ప్రాజెక్టులోకి 592 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. దిగువకు 1877 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

​ఉమ్మడి కరీంనగర్‌..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రధాన జలాశయాలకు సరికొత్త ప్రాణవాయువును అందించాయి. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాగు, సాగు నీటి అవసరాల నిమిత్తం కాళేశ్వరం లింక్‌-2 ద్వారా ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్‌హౌస్‌ మీదుగా రాజరాజేశ్వర జలాశయానికి (మిడ్‌ మానేరు) గోదావరి జలాల ఎత్తిపోతలను అధికారులు వేగవంతం చేశారు.

​జలాశయాల్లోకి ప్రవాహం.. నీటి ఎత్తిపోతలు
ఎగువ ప్రాంతాల నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. ఎల్లంపల్లికి వరద ఉధృతి ప్రమాదకరంగా మారింది. బుధవారం ఉదయం 11,735 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, సాయంత్రానికి 66,126 క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.17టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.436 టీఎంసీలకు నీరు చేరింది. తాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి నుంచి నంది పంప్‌ హౌస్‌ ద్వారా 4 మోటార్లను (ఒక్కోటి 3,150 క్యూసెక్కులు) ఆన్‌ చేసి 12,600 క్యూసెక్కుల నీటిని గాయత్రి పంప్‌హౌస్‌ (లక్ష్మీపూర్‌)కు తరలిస్తున్నారు. మానేరు, మూలవాగుల నుంచి మధ్యమానేరుకు ఇన్‌ఫ్లో 4,556 క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్ట్‌ సామర్థ్యం 27.55టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.576 టీఎంసీల నిల్వ నమోదైంది. మరోవైపు ఎస్సారెస్పీకి ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, నిల్వ 16.545 టీఎంసీలకు చేరింది. అప్పర్‌ మానేరుకు 1,400 క్యూసెక్కుల వరద వస్తుండగా నీటిమట్టం 1469.00 అడుగులకు (0.617టీఎంసీల)కు చేరింది.

​ఎడతెరిపిలేని ముసురు..
పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 66 వేల క్యూసెక్కులు దాటడంతో, ఎగువ నుంచి మరింత వరద వస్తే ఏ క్షణంలోనైనా క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. రామగుండం, మంథని ఏరియాల్లోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు, రవాణా ప్రక్రియకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మూలవాగు ప్రవాహంతో జయవరం, మల్లారం, హనుమాజీపేట, లింగంపల్లి గ్రామాల్లో ఎండిపోతున్న వరి నాట్లకు ప్రాణం వచ్చినట్టయింది.

​ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వరదలు
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నదికి ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పరవళ్లు తొక్కుతోంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఇన్‌ఫ్లో పెరిగింది. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెంలోని సమ్మక్క సాగర్‌ బ్యారేజీలోనూ ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్‌వెల్‌ వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోనూ కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద వస్తుండటంతో రాచపల్లి పంచాయతీ మల్లాపురం వద్ద ఉన్న పాలెం ప్రాజెక్టు నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కంకల వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. కన్నాయిగూడెం మండలం సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి భారీగా గోదావరి వరద చేరుతుంది. 20 గేట్లను తెరచి లక్షా 34 వేల 94 క్యూసెక్కుల వరదను కిందకు విడుదల చేశారు. అలాగే, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో చండ్రుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

కృష్ణా నది ఎగువ పరివాహకంలో కుండపోత వర్షాలు
కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. విద్యుత్‌ అవసరాల కోసం ప్యారాలాల్‌ కెనాల్‌కు 600 క్యూసెక్కులు మొత్తం కలిపి 20,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు 62,171 క్యూసెక్కుల నీరు వస్తోంది. కిందికి 76,015 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆల్మట్టి రిజర్వాయర్‌కు 68,525 క్యూసెక్కులు వస్తుండగా 64,613 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా జూరాల నుంచి 27,210 క్యూసెక్కుల నీటి వరద వస్తోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 41.2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్‌ మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడికాలువకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి బుధవారం నీరు విడుదల చేశారు. వనపర్తి జిల్లా మదనాపురంలోని రామన్పాడ్‌ రిజర్వాయర్‌ ప్రధాన ఎడమ కాలువ ద్వారా, రాజీవ్‌ భీమాపేజ్‌-2 నుంచి నీటిని ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి తదితరులు దిగువకు విడుదల చేశారు.

​పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని జలపాతాలకు పరవళ్లు తొక్కుతున్నాయి. రాష్ట్రంలోనే అతి ఎతైన కుంటాల జలపాతం వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. పొచ్చర, కొరిటికల్‌ జలపాతాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలోని గుండాల, సిర్పూర్‌(యు) మండలోని మిట్టాయి జలపాతాల అందాలు ఆకట్టుకుంటున్నాయి.

​నిజాంసాగర్‌, ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్‌ఫ్లో
ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కోటగిరి మండలం యాద్గార్‌పూర్‌లో చెరువు అలుగు పారగా, నిజాంసాగర్‌ మండలం వడ్డెపల్లిలో కట్టతెగడంతో చెరువు నీరు వృథాగా పోయింది. ప్రాజెక్టులకు స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఉదయం 4051 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరగా.. మధ్యాహ్నానికి తగ్గింది. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 6585 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.

హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, లింగంపల్లి, బేగంపేట్‌, మలక్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో రహదారులు జలమయమై ట్రాఫిక్‌ స్తంభించింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వాగులో కొట్టుకుపోయిన వృద్ధురాలు : ఆసిఫాబాద్‌లో వట్టివాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లగా జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పలు చోట్లు లోలేవల్‌ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో మోస్తరు వర్షం కురువగా మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం ఏరువచింతల్‌ గ్రామపంచాయతీ పరిధిలోని చామనపల్లి గూడెంకు చెందిన మరుసుకోల పారుభారు(50) బలివాగు వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతిచెందింది. మంచిర్యాల జిల్లాలోని ర్యాలీవాగు మత్తడి దూకుతోంది. కోటపల్లి మండంలోని బోతువాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మూడు గేట్లు ఎత్తి 5400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టులో 9225 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. రెండ్రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

మేడిగడ్డ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి..85 గేట్లు ఓపెన్‌
మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ
వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం సంగమం వద్ద గోదావరి నీటిమట్టం 5,070 మీటర్లకు చేరగా, మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ వద్ద వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. బుధవారం ఉదయం నాటికి బ్యారేజీకి 54,820 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా, వరద ఉధృతి దృష్ట్యా బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను పూర్తిగా ఎత్తేశారు. నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోని కేశవాపూర్‌- పెగడపల్లి మధ్య పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాటారం- మేడారం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

​తాలిపేరు 13 గేట్లు ఎత్తివేత
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లా చర్ల మండల పరిధిలోని మధ్యతరహా తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 85,574 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, అధికారులు బుధవారం రాత్రి 24 గేట్లలో 13 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి, 11 గేట్లను పూర్తిగా ఎత్తేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -