రుణమాఫీ ఒక పెద్ద జోక్.. రుణమాఫీ పై స్పష్టత లేదు

– గోదావరి నీటి లిఫ్టింగ్ చేయకపోవడం అన్యాయం,
– కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ మాజీమంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
నవతెలంగాణ-సూర్యాపేట
రుణమాఫీ ఒక జోక్ లా కనిపిస్తుందని , మాఫీ వివరాల పై ఇంతవరకు స్పష్టతలేక అన్నదాతలు ఆందోళన పడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలో మీడియా తో మాట్లాడారు. రుణ మాఫీ పై వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురైతున్నారని మండిపడ్డారు.రుణమాఫీ పై మసిబూసి మారేడుకాయ  చేసి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకువడంలేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం, సాగునీరు పై సీఎం సహా ఎవ్వరికీ అవగాహన లేదన్నారు. మెడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా ఎందుకు ఎత్తి పోయడంలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కాల్వలకు నీటిని ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.కాళేశ్వరం కొట్టుకుపోతది అని దుష్ప్రచారం చేశారని కాంగ్రెస్ పై మండిపడ్డారు.సాగుకు సిద్ధమైన రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. యాసంగి లా ఈ సారి కూడా రైతులను ఎండబెడితే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.గోదావరి ఆయకట్టుకు నీళ్ళందించే అవకాశం ఉన్నా రైతుల పట్ల ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గోదావరి నీళ్ళు వృధాగా పోనీయకుండా తక్షణమే సాగు, తాగు నీరు అందించాలన్నారు. హామీలు అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని ఏదైనా చేశారు. ఉచిత బస్సుల సంఖ్యను కుదించారని పేర్కొంటూ మహిళలు శపిస్తున్నారని పేర్కొన్నారు. కరెంటు కోతలు అధికమైనాయని విమర్శించారు.విద్యుత్ అధికారుల పై నెపం పెట్టి కరెంట్ కోతల నుండి తప్పించుకోవాలని చిల్లర ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు.
Spread the love