– బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే.. మోడీ తమ్ముడే కేసీఆర్
– ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర రోడ్‌షోల్లో ప్రియాంకగాంధీ
– జనాన్ని చూసి వ్యాన్‌పైనే స్టెప్పులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
‘ఈ రాష్ట్రం మీ శ్రమతో ఏర్పడింది. తెలంగాణ ఆడబిడ్డలు రాష్ట్రాన్ని నిర్మించారు. యువత పోరాడి తెచ్చుకుంది.. అటువంటి రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు.. రైతులకు రుణమాఫీ కాలేదు.. ఇండ్లూ ఇవ్వలేదు.. ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే పరిష్కారం” అని కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రియాంకగాంధీ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఖమ్మం, పాలేరు నియోజకవర్గంలోని జలగంనగర్, నాయుడుపేట, పెద్దతండా, సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం మధిర నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ప్రియాంక మండిపడ్డారు. ఎక్కడైతే వ్యవసాయం, శ్రమ మీద ఆదాయం సరిగ్గా రాదో అక్కడ సమస్యలు వెంటాడుతాయన్నారు. ఈ పదేండ్లలో ధరలు పెరిగాయి, పెట్టుబడి పెరిగింది, దానికి తగ్గ ఆదాయం మాత్రం రావట్లేదని తెలిపారు. మోడీ, కేసీఆర్ అన్నదమ్ముల్లాంటి వారేనని, కేంద్రంలో అవసరమైతే తమ్ముడు కేసీఆర్ అన్న మోడీకి సపోర్టు చేస్తాడని అన్నారు. సింగరేణిని బీజేపీ ప్రయివేటీకరించేందుకు పూనుకుంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగరేణిని ప్రభుత్వరంగంలోనే ఉంచుతామని హామీ ఇచ్చారు. ఇన్నేండ్లయినా ఇందిరమ్మ గుర్తుండటానికి కారణం భూమి, నీళ్లు, నిధుల కోసం ఆమె చేసిన పోరాటమేనని తెలిపారు. నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలి, ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యమైన శక్తులు, మీ ఓటే మీ శక్తి.. కాబట్టి డబ్బులు, స్కీమ్‌ల ఆశచూపే వారితో జాగ్రత్తని హెచ్చరించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని, సంతు సేవాలాల్ సమితి ద్వారా లంబాడ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల విదేశీ చదువులకు సహాయమందిస్తామని తెలిపారు. కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ ప్రజలను మోసం చేసి, వారి నిధులను వేరేవైపు మళ్లించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు గ్రామాల అభివృద్ధి వరకు ప్రతిదానిలోనూ అవినీతి జరిగిందన్నారు. ఏ పని కావాలన్నా కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనన్నారు.
పెద్దతండాలో ప్రియాంక స్టెప్పులు..
పోటెత్తిన జన సంద్రాన్ని చూసి ప్రియాంక ఉప్పొంగిపోయారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలో భారీగా జనం తరలివచ్చారు. పెద్దతండాలో జనాన్ని చూసి ప్రియాంక అభివాదానికి బదులు స్టెప్పులు వేసి అలరించారు. వ్యాన్‌పైన ఆమెకు అటుఇటు బంజార మహిళలు ఉండగా వారితో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. ‘మార్పు కావాలి…కాంగ్రెస్ రావాలి’ అని తెలుగులో ఆమె అనడంతో జనం ఆమెను అనుసరించారు. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మట్టా రాగమయి, మల్లు భట్టివిక్రమార్క పేర్లు ఉచ్ఛరిస్తూ జనంతో జేజేలు పలికించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీసీ నాయకులు మట్టా దయానంద్, రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరెడ్డి, మువ్వా విజరుబాబు, జావీద్, దయాకర్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, రమేష్ చింతల పాల్గొన్నారు.