గ్యారంటీల అమలు చేతకాకే తెరపైకి స్థానిక ఎన్నికలు : బండి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల హామీ అమలు చేతకాక దాటవేసేందుకే స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజరుకుమార్‌ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు ఎన్ని నిధులు అవసరం? వాటి విధివిధానాలేమిటి? ఎందుకు కసరత్తు చేయడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యతిరేకం కాదనీ, పథకాల అమలును దాటవేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణ పాఠం చెప్పాలని ప్రజల్ని కోరారు. కేంద్రం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలన్నా, అభివృద్ధి జరగాలన్నా బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమూ బీఆర్‌ఎస్‌ బాటలోనే నడుస్తున్నదని విమర్శించారు. సర్పంచులు లేక స్థానిక సంస్థల్లో పాలన పడకేసిందని తెలిపారు. కాంగ్రెస్‌కు అధిక స్థానాలను గెలిపిస్తే కేంద్రం నిధుల్ని దారిమళ్లించే ప్రమాదముందని హెచ్చరించారు.

Spread the love